Friday, October 18, 2024

TG – స‌చివాల‌యం ముట్ట‌డిలో ఉద్రిక్తత … పలువురు అరెస్ట్ …

పోలీసుల వ‌ల‌యంలో సెక్ర‌ట్రియేట్
భారీగా బ‌ల‌గాలు మొహ‌రింపు
ఎక్క‌డికక్క‌డ విద్యార్ధి,నిరుద్యోగుల సంఘాల నేత‌లు అరెస్ట్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, హైద‌రాబాద్ – కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్‌ క్యాలెండర్‌ విడుదల, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌, గ్రూప్‌ 2, 3 పోస్టుల పెంపు, డీఎస్సీ పరీక్షల వాయిదా, గ్రూప్‌-1 మెయిన్‌కు 1:100 పద్ధతిలో అభ్యర్థులను పిలవాలనే డిమాండ్లతో నిరుద్యోగులు, ఉద్యోగార్ధులు రాష్ట్ర సచివాలయం ముట్టడికి నేడు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సెక్రెటేరియట్‌ పోలీసుల వలయంలోకి వెళ్లింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలిరానున్న నేపథ్యంలో సచివాలయం వద్ద భారీగా పోలీసులును మోహరించారు. బాహుబలి బారికేడ్లు, ఇనుపకంచెలు, వాటర్‌ క్యానన్లను ఏర్పాటు చేశారు.

- Advertisement -

ఎక్క‌డిక‌క్క‌డ అరెస్ట్ లు

కాగా, రాష్ట్రం నలుమూలల నుంచి సచివాలయ ముట్టడికి తరలివస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు విద్యార్థి, యువజన నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. పలువురిని గృహనిర్బంధంలో ఉంచారు. అశోక్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులను, నిరుద్యోగులను వెతికిమరీ పట్టుకుని ఠాణాల్లో వేశారు. అశోక్‌నగర్‌, చిక్కడపల్లి ప్రాంతాల్లోని అన్ని బుక్‌స్టోర్స్‌, టీ స్టాళ్లను మూసివేయించారు. అశోక్‌నగర్‌, చిక్కడపల్లి ప్రాంతాల్లో అనధికారికంగా 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ప్రతి గల్లీలో పహారా కాస్తున్నారు. సెంట్రల్‌ ల్రైబ్రరీ వద్ద గస్తీ తిరుగుతున్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లకుండా పికెట్లు ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్‌కు వచ్చే దా రుల్లో పోలీసులు భారీగా మోహరించారు.

తార్నాకలో బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలుని తన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ అరెస్టులతో నిరుద్యోగుల ఉద్యమాన్ని ఆపలేరని ఆయన అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా డీఎస్సీ, గ్రూప్‌ 1, 2, 3, 4 అభ్యర్థులు, నిరుద్యోగ విద్యార్థులకు అండగా ఉంటామన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అచ్చంపేట, అమరచింత, ఆత్మకూరులో, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మదనాపురం, కొత్తకోటలో పలువురు విద్యార్థి నాయకులు, బీఆర్‌ఎస్వీ, బీఆర్‌ఎస్‌ యువజన విభాగం నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement