Wednesday, November 20, 2024

TG – ప‌రిశీల‌న‌లో తెలుగు వర్సిటీకి సురవరం పేరు… రేవంత్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు నేడు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందరూ సహకరిస్తే సురవరం ప్రతాప రెడ్డి పేరు పెడదామని ఆయన సభ్యులను కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రతిపాదనపై కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. సురవరం ప్రతాప రెడ్డి గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ ఆలోచన చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కూనంనేని చెప్పారు. సురవరం ప్రతాప రెడ్డి పేరు అందరూ ఆమోదించాలని సభలోని సభ్యులకు ఆయన పిలుపునిచ్చారు.

వైతాళికుడు సుర‌వ‌రం ….

తన బహువిధ రచనా ప్రక్రియల ద్వారా, నిద్రావస్థలో ఉన్న తెలుగు జాతిని జాగృతం చేసిన వైతాళికుల్లో సురవరం ప్రతాపరెడ్డి ఎన్నదగినవారు. 1896 మే 28న ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లా అలంపూర్​తాలూకా బోరువెల్లి గ్రామంలో జన్మించిన ఆయన.. గోల్కొండ పత్రిక సంపాదకులుగా, సమాజ సేవకుడిగా, బహుగ్రంథకర్తగా, భాషా పరిశోధనల ద్వారా ఆంధ్రుల సంస్కృతిని పరివ్యాపితం చేసిన ప్రయోక్తగా తెలుగుజాతికి చిరపరిచితులు. కానీ, అనేక కారణాల వల్ల ఆయనకు నిజంగా రావాల్సినంత ఖ్యాతి దక్కలేదేమో అనిపిస్తుంది. అందుకు, స్వతస్సిద్ధమైన ఆయన స్వభావం కూడా కొంతవరకు కారణమై ఉండొచ్చు.

- Advertisement -

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆయన ప్రచారం కోసం అర్రులు చాచింది ఎప్పుడూ లేదు. సాధికారికంగా ఆయన చెప్పే ప్రతి అంశంలోనూ నిశిత పరిశీలనా పరిశోధనా దృష్టి, లోతైన విషయ పరిపక్వత వాటన్నింటికీ మించిన మానవీయత–నిజాయతీ తొణికిసలాడుతుంటాయి. ప్రచార కండూతి ఏ కోశానా కనిపించదు. కారణం ఏదైనా, సురవరం ప్రతాపరెడ్డికి అర్హమైన హేతుబద్ధమైన స్థానం కల్పించకపోవడం వల్ల ఆయన నష్టపోయినదానికన్నా తెలుగు జాతి నష్టపోయిందే ఎక్కువ. రాజకీయ, సాహిత్య, సంగీతాదిరంగాల్లో తెలుగునాట లబ్ధప్రతిష్టులైన 75 మంది నాటి ప్రముఖ ‘పెన్​పోర్​ట్రెయిట్స్’ను 1959-61లలో ఆంధ్ర సచిత్ర వార పత్రికల్లో ధారావాహికంగా ప్రచురించారు. అందులో సురవరం ప్రతాపరెడ్డి వంటి బహుముఖ ప్రజ్ఞాశాలికి చోటుదక్కకపోవడం విచిత్రం.

Advertisement

తాజా వార్తలు

Advertisement