15న సీతారామ ప్రాజెక్టు ప్రారంభం
పది లక్షల ఎకరాలకు గోదావరి జలాలు
20 ఏళ్లుగా ఎన్నో మలుపులు తిరిగి రూపుదిద్దుకున్న వైనం
భీమునిగుండం వద్ద ఎత్తిపోతల పథకం పనులు
పూచిగూడెం, కమలాపురం, బిజి కొత్తూరు లిఫ్టులు
ఉమ్మడి ఖమ్మం జిల్లా భూములు సస్యశ్యామలం
₹7500 కోట్ల ఖర్చుతో చేపట్టిన పనులు
ఈ ఏడాది బడ్జెట్‌లో మరో ₹1100 కోట్ల కేటాయింపు
జాతికి అంకితం చేయనున్న సీఎం రేవంత్
మంత్రి తుమ్మల కృషిపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
ఆంధ్రప్రభ స్మార్ట్, ఖమ్మం : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదించిన సీతారామ ప్రాజెక్టు ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధం కావడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందించే ఈ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 15న జాతికి అంకితం చేయనున్నారు. సుమారు 20ఏళ్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన కృషి ఫలితంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుందని జిల్లా రైతులు చెబుతున్నారు. రూ.13,500 కోట్ల అంచనాలతో ప్రాజెక్టు పనులు చేపట్టగా, ఇప్పటివరకు ₹7500 కోట్లను కేటాయించి ఖర్చు చేశారు. ఇటీవల రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం మరో ₹1100కోట్లను కేటాయించడంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ఎన్నో మలుపులు
ఎన్నో మలుపులు తిరిగిన తర్వాత సీతారామ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం హయాంలో దుమ్ముగూడెం ప్రాజెక్టుకు ప్రతిపాదనలు చేశారు. 2004లో తెలుగుదేశం దిగిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దుమ్ముగూడెం ప్రాజెక్టును రెండు విభాగాలుగా చేసి, మొదట భాగానికి రూ.2వేల కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. రెండోది రూ.3,600 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. రాజీవ్, ఇందిరా సాగర్ పేర్లతో దుమ్ముగూడెం, రుద్రంకోట వద్ద ఎత్తిపోతల పథకాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. సుమారు నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే విధంగా రూ.3,600 కోట్లతో ప్రతిపాదనలు చేసి సుమారు రూ. రెండు వేల కోట్లు ఖర్చుపెట్టి మోటార్లు, పైపులు కొనుగోలు చేసి పనులు కూడా చేపట్టారు. 1800 క్యూసెక్కుల నీటిని వినియోగించే లక్ష్యంతో రాజీవ్, ఇందిరాసాగర్‌లను ప్రతిపాదించారు.
రాష్ట్ర విభజన తర్వాత…
రాష్ట్ర విభజన తర్వాత రుద్రంకోట వద్ద ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసే ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి చేరింది. దీంతో చింతలపూడి ప్రాంతానికి ఆయకట్టు ఏర్పాటు చేయగా, మొత్తం ఆయకట్టులో 70 వేల ఎకరాలు ఆంధ్ర పరిధిలో ఉంది. ఆ తర్వాత టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగా అప్పటి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు వినతి మేరకు దుమ్ముగూడెం ప్రాజెక్టు డిజైన్ మార్పు చేయించారు అప్పటి సీఎం కేసీఆర్. ఈ డిజైన్ మార్పుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు మహబూబాబాద్ జిల్లా కూడా కలుపుకుని మొత్తం పది లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. రూ.15 వేల కోట్లతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు సీతారామ ఎత్తిపోతల పథకం అని నామకరణం చేశారు. దీనిలో భాగంగా సుమారు రూ.7500 కోట్లు ఖర్చుపెట్టి ప్రధాన కాలువతో పాటు మూడు భారీ లిప్టులు ఏర్పాటు చేశారు. సత్తుపల్లి సమీపంలో యాతాలకుంట వద్ద టన్నెల్ నిర్మాణం కూడా ప్రారంభించారు. సుమారు 9 వేల క్యూసెక్కులు నీటి సరఫరా అయ్యేలా కాలువలు నిర్మించారు.
సీతమ్మ సాగర్…
సీతారామ ప్రాజెక్టుకు అనుసంధానంగా దుమ్ముగూడెం వద్ద 36 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా సీతమ్మ సాగర్‌ను ప్రభుత్వం నిర్మించింది. సుమారు రూ.3,121 కోట్లతో తలపెట్టిన సీతమ్మ సాగర్‌కు రూ.1,500 కోట్లతో 67 శాతం పనులు పూర్తయ్యాయి. సీతమ్మ సాగర్ వద్ద 280 మెగా వాట్ల హైడల్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది. కాగా, పాలేరుకు అనుసంధానం చేసే లింక్ కెనాల్‌తో పాటు జూలూరు పాడు వద్ద రూ.180 కోట్లతో 2 కి.మీల టన్నెల్, డోర్నకల్ వద్ద రూ.300 కోట్లతో 8 కి.మీ టన్నెల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏన్కూరు నుండి వైరా వరకు 8 కిలోమీటర్లు సీతారామ లింక్ కెనాల్ పనులు కొనసాగిస్తున్నారు. ఆగస్టు 15 నాటికి పనులు పూర్తి చేసి ఈ ఖరీఫ్ సాగుకు నీరు విడిచిపెట్టాలన్న లక్ష్యంగా శరవేగంగా పనులు పూర్తి చేయించేలా చర్యలు చేపట్టారు.
గోదావరి జలాలు వెళ్లేదిలా…
భీమునిగుండం కొత్తూరు వద్ద గల సీతారామ ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్ నుండి 9000 క్యూసెక్కులు గోదావరి జలాలు ఈ కాలువలోకి ఎత్తిపోస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పూచిగూడెం, కమలాపురం, బిజి కొత్తూరు ఈ మూడు లిఫ్ట్ ఇరిగేషన్‌లను నెలలోపే ట్రయల్ రన్ పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామన్నారు. ఈ మూడు లిఫ్ట్‌ల నుంచి ఏన్కూరు కాలువలోకి గోదావరి జలాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏన్కూరు మెయిన్ కెనాల్ పూర్తి చేసి వైరా ప్రాజెక్టును నింపుతారన్నారు. సీతారామ కెనాల్‌కు అనుసంధానంగా ఉన్న చెరువులన్నింటిని గోదావరి జలాలతో నింపి ఆయా ప్రాంత రైతాంగానికి సాగు భూములకు నీరందిస్తామన్నారు.
15న ప్రారంభం
సీతారామ ప్రాజెక్టును ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఏడాది లక్షన్నర ఎకరాలకు గోదావరి జలాలు… ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నందున ఈ ఏడాది ఖరీఫ్‌లో లక్షన్నర ఎకరాలకు గోదావరి జలాలను అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా రైతు రుణమాఫీ రూ.2 లక్షలతోపాటు, ఖమ్మం ఉమ్మడి జిల్లా రైతాంగానికి సీతారామ ప్రాజెక్టును అంకితం చేయనున్నారని చెప్పారు.