ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రేవంత్ సర్కార్ రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించింది. రూ.లక్ష వరకు రుణం ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ మొత్తం జమ చేశారు రేవంత్ రెడ్డి . లక్ష లోపు రుణాల మాఫీ కోసం ప్రభుత్వం రూ. 6 వేల కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో 11 లక్షల మంది రైతులకు లక్షలోపు రుణాలున్నాయి. దీంతో వీరందరి రుణాలు ఇప్పుడు మాఫీ కానున్నాయి.
ఆగస్టు మొదటి వారంలో రూ.లక్షన్నర లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఆ తర్వాత రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయనుంది. ఆగస్టులో రుణమాఫీ ప్రక్రియ మొత్తాన్ని ప్రభుత్వం పూర్తి చేయనుంది. ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్ నేతలు సంబరాలు నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ చిత్ర పటానికి కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం నిర్వహిస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
రైతులతో రేవంత్ వీడియో కాన్ఫ్ రెన్స్ ..
సచివాలయంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం రేవంత్ రుణమాఫీ పొందిన వివిధ జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహా దారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు కె కేశవరావు ,సీఎస్ శాంతి కుమారి,ఉన్నతాధికారులు పాల్గొన్నారు.