వందేమాతరం ఫౌండేషన్ పదో తరగతి గవర్నమెంట్ స్కూల్ టాపర్ విద్యార్థులకు రవీంద్ర భారతి లో నేడు జరిగే సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
సాయంత్రం 5.30 గంటలకు బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ లో రివ్యూ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు
. కాగా.. వరుస ఎన్నికల కోడ్‌లతో స్తంభించిన పాలనకు గండి కొట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నాయి
రైతు రుణమాఫీ వంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు హామీల అమలుతో పాటు సాధారణ పాలనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను చేపట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అయితే.. పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పన, ఆదాయ వనరుల పెంపుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే సమీక్షలు ప్రారంభించగా, నేటి నుంచి మంత్రులందరూ అన్ని శాఖలపై వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ సమీక్షల అనంతరం కీలక నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ఆయా శాఖల పనితీరును తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనలకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
మంత్రులందరూ వారి వారి నియోజకవర్గాలు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాలు, బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లాలకు వెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలిస్తారు.