హైదరాబాద్ – కులగణనలో తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా మార్చాలని పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సోనియాగాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టి తీరుతామని స్పష్టం చేశారు. కులగణనపై గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం ఒక మాట ఇస్తే హరిహరాదులు అడ్డు వచ్చినా అది నెరవేర్చి తీరుతుందన్నారు. మనం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టే వారసులం అని చెప్పుకొచ్చారు. రేవంత్ కి ప్రత్యేక గుర్తింపు ఏమీ లేదు.. కాంగ్రెస్ పార్టీనే గుర్తింపు ఇచ్చిందని ఆయన తెలిపారు. మీరంతా కష్టపడితేనే నాకు ఈ బాధ్యత వచ్చింది..పార్టీ ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లాం.. పార్టీ విధానాన్ని అమలు చేయడమే మన ప్రభుత్వ విధానం.. పని చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా.. ప్రతీ క్షణం సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ క్యాడర్, లీడర్స్ మీద ఉందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఇక, కుల గణనపై సమన్వయం చేసుకునేందుకు 33 జిల్లాలకు 33 మంది అబ్జర్వర్స్ ను నియమించాలని రేవంత్ సూచించారు. బాధ్యతగా పని చేయండి.. మీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుందని అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అమలు చేసే క్రమంలో ఎవరు అభ్యంతరకరంగా వ్యవహరించినా వారిని పార్టీ క్షమించదని తేల్చి చెప్పారు. . నవంబర్ చివరిలోగా కులగణన పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలని సూచించారు.
అలాగే, తెలంగాణ నుంచే నరేంద్ర మోడీపై యుద్ధం ప్రకటించాలి అని ఆయన తెలిపారు. కుల గణన ఎక్స్ రే మాత్రమే కాదని.. ఇది మెగా హెల్త్ చెకప్ లాంటిదని అన్నారు.. భవిష్యత్ లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో మన మోడల్ ను పరిగణనలోకి తీసుకునేలా మోడల్ డాక్యుమెంట్ ను కేంద్రానికి పంపుతామని అన్నారు.
అలాగే, కొంతమంది అగ్రవర్ణాల కోసమే గ్రూప్- 1 నిర్వహిస్తున్నారని.. బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఒక వాదన తీసుకొచ్చారని సీఎం చెప్పుకొచ్చారు. సెలక్ట్ అయిన 31,383 మందిలో 10 శాతం లోపు మాత్రమే అగ్రవర్ణాలు ఉన్నారు. రేవంత్ రెడ్డి చట్టాన్ని అమలు చేస్తాడు తప్ప.. వ్యక్తిగత ఎజెండాతో పని చేయడు అని ఆయన తెలిపారు.