వరంగల్ చేరుకున్న ముఖ్యమంత్రి
అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ తిలకించిన సిఎం
హనుమకొండలో సభలో ప్రసంగించనున్న రేవంత్
వరంగల్, : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సభ ప్రారంభమైంది. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఇందిరాగాంధీ జయంతి రోజైన నేడు ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.. దీని కోసం ఇప్పటికే ఆయన హెలికాప్టర్ లో వరంగల్ కు చేరుకున్నారు..
కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవం
తొలితరం తెలంగాణ ఉద్యమనేత, తెలంగాణ భావజాల వ్యాప్తి చేసిన అభ్యుదయ కవి కాళోజీ నారాయణ రావు పేరిట నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారు.. రూ.92 కోట్లతో ఈ కళా క్షేత్రాన్ని అత్యాతుధునిక హంగులతో నిర్మించారు.. ఈ క్షేత్రం ప్రారంబోత్సవ అనంతరం సిఎం ఇక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు.. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా హనుమకొండలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ సభకు బయలు దేరి వెళ్లారు..
ఈ సభలో ముందుగా సీఎం రేవంత్ మంత్రులతో కలిసి 22 జిల్లాల్లో ఇందిరా మహిళాశక్తి భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు.. అదేవిధంగా బహిరంగ సభ వేదికపైనే విద్యుత్, ఆర్టీసీ శాఖలతో మహిళా సంఘాలతో ఎంఓయూ చేయనున్నారు. అలాగే మహిళలకు బ్యాంకు లింకేజికి సంబంధించిన చెక్కులను పంపిణీ చేస్తారు.
భారీగా తరలి వచ్చిన మహిళలు ..
హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఏర్పాటు చేసిన ఈ సభకు లక్ష మందికి పైగా మహిళల తరలి వచ్చారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు , కార్యకర్తలు హాజరయ్యారు.. మరికొద్దిసేపటిలో రేవంత్ ఈ సభలో మహిళలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు..