ఢిల్లీ – పలు శాఖలకు మంత్రులు లేరని బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారని, అయితే రాష్ట్రంలోని అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారని స్పష్టం చేశారు. విద్యాశాఖ తన వద్దే ఉందన్నారు. ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడి మంత్రులు మెరుగ్గా ఉన్నారో లేదో చూడాలని హితవు పలికారు. ఢిల్లీలో నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ , తెలంగాణలో ఏ శాఖలు ఖాళీగా లేవన్నారు. అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులు ఉన్నారన్నారు.
ప్రభుత్వాన్ని పడగొట్టడమే కెసిఆర్ భావదారిద్య్రం..
ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకోవడమే కేసీఆర్ భావదారిద్య్రం అని సీరియస్ అయ్యారు. కేసీఆర్‌కు ఇప్పటికీ కనువిప్పు కలగలేదన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు కేసీఆర్‌ను ఆహ్వానించామన్నారు. రాష్ట్రావతరణ దినోత్సవంలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ అన్నారు. గతంలో 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేసీఆర్ లాక్కున్నారని గుర్తు చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించినందుకు కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.
జీవన్ రెడ్డి సేవలను వినియోగించుకుంటాం…
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకబూనిన అంశంపై రేవంత్ మాట్లాడుతూ, జీవన్ రెడ్డి అనుభవాలను పార్టీ వినియోగించుకుంటుందన్నారు. జీవన్ రెడ్డి చర్యల వల్ల కాంగ్రెస్‌కు నష్టం జరగాలని చూశారన్నారు.
కాంగ్రెస్ పట్ల జీవన్ రెడ్డికి ఉన్న నిబద్ధత వారికి అర్థం కాదని పరోక్షంగా బీఆర్ఎస్పై మండిపడ్డారు. హైకమాండ్ హామీతో . జీవన్ రెడ్డి సలహాలు ఎప్పుడూ తీసుకుంటామన్నారు.
త్వరలో కొత్త పిసిపి అధ్యక్షుడు
కొత్త పీసీసీ చీఫ్‌ను నియమించాలని హై కమాండ్‌కు చెప్పినట్లు రేవంత్ వెల్లడించారు. మూడేళ్ల తన పదవి కాలం ముగిసిందన్నారు. సమర్థవంతమైన నాయకుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలన్నారు. అభివృద్ధి పనుల కోసం మంత్రులు కేంద్ర మంత్రులను కలుస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. ఏకకాలంలో రుణమాఫీ అమలుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు. ఏపీ, తెలంగాణ వివాదాల గురించి స్పందిస్తూ.. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకుంటామన్నారు.
సజావుగా ఎన్నికలు నిర్వహించాం..
రాష్ట్రంలో సజావుగా ఎన్నికలు నిర్వహించామని, ఎన్నికల నిర్వహణపై కేంద్రం కూడా తమ ప్రభుత్వంపై ఎటువంటి ఆరోపణలు చేయలేదన్నారు. ఇదే సమయంలో ఎపిలో 50మందికి పైగా అధికారులపై ఆరోపణలు రావడంతో బదిలీలు అయ్యారని గుర్తు చేవారు. ఎన్నికల నిర్వహణపై రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు చేయలేకపోయారన్నారు. రాష్ట్రంలో రాజకీయ ప్రేరేపిత కేసు ఒక్కటీ పెట్టేలేదని సీఎం క్లారిటీ ఇచ్చారు.
విద్యుత్ విచారణ కమిషన్ పై..
విద్యుత్‌పై విచారణ కమిషన్‌ను తాము ప్రతిపాదించలేదన్నారు. మంత్రి వర్గంపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయొద్దన్నారు. ఆరు గ్యారంటీలను తప్పకుండా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్‌లో చేరారన్నారు.