మీరేమో సబర్మతిని ఫ్రంట్ నిర్మించుకుంటారు
మేమేమో మూసి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే అడ్డుకుంటారు
పటేల్ ఘాట్ లాగా ఇక్కడ బాపూ ఘాట్ ను అభివృద్ధి చేస్తాం
ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తుంటే బిజెపి వణకి పోతుంది
గుజరాత్ కు తెలంగాణ పోటీ అని భయపడుతుంది కేంద్రం
అందుకు తెలంగాణకు అన్ని విధాల సహయ నిరాకరణ
నిధులేమో ఉత్తరాది వాళ్లకు.. రిక్త హస్తాలేమో దక్షిణాదికి
పన్నుల వాటలో కూడా తెలంగాణకు అన్యాయమే
మోదీవి అన్ని విభజన రాజకీయాలే
ప్రజలు అన్ని గమనిస్తున్నారు…
సదరన్ సమిత్ లో కేంద్ర ప్రభుత్వంపై రేవంత్ నిప్పులు
హైదరాబాద్ – అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా హైదరాబాద్ లోని బాపూ ఘాట్ ను అభివృద్ధి చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా బాపూ ఘాట్ ను తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రైవేటు మీడియా నెట్ వర్క్ నేడు నిర్వహించిన సదరన్ రైజింగ్ సమిత్ లో సిఎం మాట్లాడుతూ, . ఈసా, మూసా నదులు కలిసే చోట బాపూ ఘాట్ ఉందన్నారు. పటేల్ విగ్రహంలా బాపూ ఘాట్ లో గాంధీజీ విగ్రాహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
బాపూ ఘాట్ ను వ్యతిరేకిస్తున్న బిజెపి
మూసీ పునరుజ్జీవాన్ని, బాపూ ఘాట్ అభివృద్ధిని బీజేపీ వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు రేవంత్ . గాంధీ వారసులుగా తాము బాపూ ఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతామని స్పష్టం చేశారు. దీన్ని బీఆర్ఎస్, బీజేపీ ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నాయి? అని సీఎం ప్రశ్నించారు. గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకోవచ్చు కానీ తాము మూసీ పునరుజ్జీవం చేస్తామంటే మీ బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారెందుకు అని నిలదీశారు. ఎందుకంటే తాము గుజరాత్ కు పోటీ ఇవ్వబోతున్నామని , దీంతో తెలంగాణను, హైదరాబాద్ ను ఫినిష్ చేయాలని బీజేపీ నేతలు తమ ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఫ్యూచర్ సిటీతో బిజెపిలో వణకు
ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రాడార్, ఇరిగేషన్ ప్రాజెక్టులతో తెలంగాణ పురోగతి సాధించి గుజరాత్ కు పోటీ ఇస్తుందనే విషయం తెలిసే మా ప్రయత్నాలను ఆపేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రయత్నం చేస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ వ్యతిరేకించిన మరుసటి రోజే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడతారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తే సమస్య ఏంటని నిలదీశారు.
మా రాష్ర్టాలపై మీకు చిన్నచూపు ఎందుకు..
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సౌత్ స్టేట్స్ కు ప్రధాని మోడీ అందించిన సహకారం చాలా తక్కువ అని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం పెద్దగా నిధులు ఇవ్వకపోయినా ఇక్కడి ఓట్లు కావాలని ఎలా అడుగుతారని ప్రశ్నించారు.
నార్త్ స్టేట్స్ తో పోలిస్తే సౌత్ స్టేట్స్ ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నా వాటిలో తిరిగి పొందేది మాత్రం చాలా తక్కువ వాటా ఉందన్నారు. కేంద్రానికి మేం ఒక్క రూపాయి పంపిస్తే తిరిగి వెనక్కి వస్తున్నవి కేవలం రూ.40 పైసలు మాత్రమేనన్నారు. అదే యూపీ నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి వెళ్తే రూ.7, బిహార్ కు రూ.6 వెనక్కి వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను దక్షిణాది రాష్ట్రాలు ఆహ్వానిస్తున్నా నిధుల విషయంలో మాత్రం వివక్ష జరుగుతూనే ఉందని విమర్శించారు. ప్రధాని మోడీ ఉత్తర భారత దేశానికి చెందిన వ్యక్తి కావడమే ఈ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడానికి కారణం అని పేర్కొన్నారు.
బిఆర్ఎస్ తన ప్రభుత్వాన్ని కూల్చాలని చూసింది..
తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బిఆర్ఎస్ నేతలు తనను పడగొట్టాలని అనుకున్నారని , దాంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే తనకు మద్దతుగా నిలిచారన్నారు. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపించిన గత సీఎం కేసీఆర్ పది సార్లు కూడా సెక్రటేరియట్ కు రాలేదని గుర్తు చేశారు.. ప్రతిపక్ష హోదా ఇస్తే పది నిమిషాలు గవర్నర్ స్పీచ్ లో కూర్చుని వెళ్లిపోయారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంపై కెసిఆర్ కు నమ్మకం ఉంటే ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించారు.
కెసిఆర్ తాను ఒక జమీందార్ అని భావిస్తున్నారని, అందుకే బయటరు రావడం లేదని విమర్శించారు. ప్రజలు ఎన్నుకుంటే తాము అధికారంలోకి వచ్చామని అంటూ మీకు నచ్చకుంటే ఇంట్లో కూర్చోండి. మా ప్రభుత్వాన్ని పని చేయనివ్వండి అన్నారు. తమ ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని చూస్తే ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు. పార్లమెట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకో కేసీఆర్ ప్రజల ఆలోచనను అర్థం చేసుకోవాలన్నారు. ప్రజల ఆలోచనను పట్టించుకోకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు.
సంస్కరణలు తెచ్చిందే కాంగ్రెస్ నేతలు
ఈ దేశంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ నేతలని గుర్తు చేశారు రేవంత్.. నెహు నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్ వంటి అనేక మంది కాంగ్రెస్ ప్రధానులు ఈ దేశంలో అనేక సంస్కరణలు, విప్లవాలు తీసుకువచ్చారు. మరి మూడో సారి ప్రధాని అయిన నరేంద్రమోడీ ఈ దేశ ప్రజల కోసం విప్లవాత్మకు మార్పులు తీసుకువచ్చారని ప్రశ్నించారు. పార్టీలను చీల్చడం, భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం తప్ప మీరు చేసిందేంటని బిజెపిని నిలదీశారు రేవంత్. ఈ దేశంలో ఉత్తర, దక్షిణ భారత దేశం అనే విభజన తేవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా నార్త్ వ్యక్తి ప్రధానిగా ఉండే సౌత్ వ్యక్తి రాష్ట్రపతిగా ఉండటం ఆనవాయితీగా ఉండేదన్నారు. కానీ ఆ నియమాన్ని మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. విభజన రాజకీయాలతో దేశ ప్రజల మధ్య అనైక్యత తీసుకువస్తున్నది మోడీయే నంటూ ధ్వజమెత్తారు.