హైదరాబాద్ – హోం మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నరేవంత్ రెడ్డి నిర్లక్ష్యంతో 41 శాతం నేరాలు పెరిగాయని అన్నారు మాజీ మంత్రి , బిఆర్ ఎస్ నేత హరీశ్ రావు. రేవంత్ రెడ్డి సీఎంగా, హోంమంత్రిగా కూడా ఫెయిల్ అయ్యారని,. ఏడాదిలో తొమ్మిది మతకల్లోలాలు చోటు చేసుకున్నాయన్నారు. మెదక్ జిల్లా బిఆర్ఎస్ కార్యాలయంలో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడినవన్నీ అబద్ధాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగిన వాళ్ళను బెదరగొడుతున్నాడని మండిపడ్డారు. ఆరు ఆరు గ్యారెంటీలపై చేతులెత్తేశారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వాన్ని ఎవరైనా అడిగినా… ప్రశ్నించినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగబడుతున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు, అన్ని మతాలకు రేవంత్ అన్యాయం చేశారని విమర్శించారు. కేసీఆర్ ఉండగా క్రిస్మస్ వేడుకలను అధికారికంగా నిర్వహించామన్నారు. ఈ ప్రభుత్వం క్రిస్మస్ కానుకలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
రైతు బంధు ఎప్పుడు ఇస్తావని అడిగితే రెండు గంటల పాటు చెత్త ఉపన్యాసం ఇచ్చారని విమర్శించారు. కౌలు రైతులను కూడా మోసం చేశారని ఆరోపించారు. ఎలాంటి కోతలు లేకుండా ప్రతి కూలీకి రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో కూడా కేసీఆర్ రైతుబంధును ఆపలేదని గుర్తు చేశారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ అయిందని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేశారు. మెదక్ జిల్లాలో ఒకేరోజు ముగ్గురు రైతులు, ఏడాది కాంగ్రెస్ పాలనలో వందలాది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కానీ ముఖ్యమంత్రి ఏ ముఖం పెట్టుకొని సిగ్గులేకుండా మెదక్ వస్తున్నారని నిలదీశారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్ముకున్నారని, వడ్లు కూడా కొనలేని చేతకాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు. నమ్మి ఓటేసిన ప్రజలకు గాడిద గుడ్డు మిగిల్చాడని ఎద్దేవా చేశారు. ఏడాది పాలనలో కొత్త పథకాలు ఇవ్వకపోగా… బీఆర్ఎస్ హయాంలో ఉన్న పథకాలను కూడా బంద్ చేశారన్నారు.