న్యూ ఢిల్లీ – ఎన్డీయే కూటమి ప్రభుత్వ హయాంలోనే వరంగల్ విమానాశ్రయాన్ని నూటికి నూరుపాళ్లు పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో కొత్త విమానాశ్రయాల నిర్మాణాలకు సహకరించాలని కోరారు.. వరంగల్ తో పాటు పెద్దపల్లి, భద్రాద్రి, కొత్తగూడెం అదిలాబాద్ లో విమానాశ్రయాల నిర్మాణాలు రాష్ర్ట ప్రభుత్వం తరుపున కేంద్రానికి అన్ని విధాల సహకరిస్తామని కేంద్ర మంత్రికి రేవంత్ వివరించారు.. సెకండ్ టైర్ పట్టణాలలో విమానాశ్రయాల ఏర్పాటు అవశ్యకతను సవివరంగా సిఎం చెప్పారు..
దీనిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. వరంగల్‌తోపాటు మరో మూడు.. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తమను కోరారన్నారు. అయితే పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం విషయంలో ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి ఉందన్నారు. అందుకు సంబంధించిన నివేదిక సానుకూలంగా వస్తే అనంతరం భూసేకరణకు వెళ్ల వచ్చని ఆయన చెప్పారు.
ఆదిలాబాద్ విమానాశ్రయం మాత్రం రక్షణ శాఖ పరిధిలో ఉందని గుర్తు చేశారు. ఆ శాఖ నుంచి అనుమతి వస్తే ఆదిలాబాద్‌లో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అదీకాక ఆదిలాబాద్‌కు ఓ వైపు చత్తీస్‌గఢ్, మరోవైపు మహారాష్ట్రలు సరిహద్దులు ఉన్నాయన్నారు. దీంతో ఆ దరిదాపుల్లో విమానాశ్రయం లేదని గుర్తు చేశారు. అక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. దీనిపై రక్షణ శాఖ మంత్రిత్వ శాఖతో మాట్లాడతామని రామ్మోహన్ హామీ ఇచ్చారు.
మరోవైపు వరంగల్ విమానాశ్రయం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రో యాక్టివ్‌గా వ్యవహరిస్తూ.. భూసేకరణకు ఇప్పటికే సర్క్యులర్ సైతం జారీ చేసిందని ఆయన వివరించారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా వరంగల్‌లో విమానాశ్రయాన్ని నిర్మి్స్తామని ఆయన ప్రకటించారు.