Monday, October 21, 2024

TG పెద్దపల్లిలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు

పెద్దపల్లి, (ప్రభన్యూస్‌): రబీ సీజన్‌లో పెద్దపల్లి జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశారు. గత ఏడాది కంటే రెట్టింపు ధాన్యం రైతుల నుండి కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో 94శాతం నగదును జమ చేశారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలించే ప్రక్రియ పూర్తి కావడంతో జిల్లాలోని 311 కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. ఈ ఏడాది రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కోసం పెద్దపల్లి జిల్లాలో ఐకెపి నుండి 61 కొనుగోలు కేంద్రాలను, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 250 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు- చేసి 52,700 మంది రైతుల నుండి 3,32,287.368 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 728.62 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు.

ఇప్పటికే 50,378 మంది రైతులకు 681.25 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారు. ఐకెపి ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి 122.14 కోట్ల రూపాయలు, ప్రాథవిుక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి 559.11 కోట్ల రూపాయలను రైతులకు చెల్లించారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి 94శాతం డబ్బులను వారి ఖాతాల్లో జమ చేశారు. కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌, అదనపు కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ లాల్‌లు ప్రారంభించడంతోపాటు ప్రతినిత్యం కెద్రాలలో జరుగుతున్న కొనుగోలు తీరును పర్యవేక్షించారు. గన్నీ బ్యాగుల అందజేత, ధాన్యం తూకం, మిల్లులకు తరలింపు ప్రక్రియను పర్యవేక్షించడంతోపాటు సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడంతో రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరిగాయి. త్వరితగతిన కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయడంతోపాటు ధాన్యానికి నగదును తమ ఖాతాల్లో జమ చేయడం పట్ల రైతులు జిల్లా అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement