ఏకంగా 40 అడుగులు లోపలికి, 30 అడుగుల ఎత్తులో మట్టి
మూసికే మట్టితో కట్ట వేసిన రాజ్ పుష్ప
హైడ్రా చీఫ్ రంగనాథ్ పరిశీలనలో వెలుగులోకి
మట్టి మొత్తం తొలగించాలంటూ ఆ సంస్థకు నోటీస్…
పూడ్చిన మూసి నది లోంచి మట్టి తీసివేత
హైదరాబాద్ – దేశంలో అతి పెద్ద రియల్ వ్యాపార సంస్థ రాజ పుష్ప కు హైడ్రా షాక్ ఇచ్చింది.. ఏకంగా మూసి నదిని మట్టితో పూడ్చి వేయడంతో హైడ్రా చీఫ్ కన్నెర్ర చేశారు.. నది ప్రవాహానికి అడ్డుగా ఏకంగా 30 అడుగుల ఎత్తుతో మట్టితో పూడ్చడాన్ని ఆయన తప్పు పట్టారు.. గండిపేటకు చేరువలో నార్సింగి ప్రాంతంలో మూసీలో పోసిన మట్టిని తొలగించాలని రాజపుష్ప నిర్మాణ సంస్థకు ఆయన నోటీస్ జారీ చేశారు.. అలాగే ఈ ప్రాంతంలో కట్టడాలను నిలిపివేయాలని కూడా ఆదేశించారు..కాగా రెండు వారాల క్రితం మూసీ నదిలో మట్టిపోసి కబ్జా చేస్తున్నారనే ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వారం రోజుల క్రితం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఫిర్యాదులో వాస్తవాలు ఉండటంతో నదిలోకి జరిగి నింపిన మట్టిని వెంటనే తొలగించాలని రాజపుష్ప నిర్మాణ సంస్థకు సూచించారు. అలాగే ఈ మేరకు మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అధికారులు హద్దులు నిర్ధారించాలని కమిషనర్ కోరారు. ♦️ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, మున్సిపాలిటీ అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు రంగనాథ్..
ఇక హైడ్రా కమిషనర్ స్పష్టమైన ఆదేశాలతో రాజ పుష్ప నిర్మాణ సంస్థ మట్టిని తొలగించే పని చేపట్టింది. 40 అడుగుల లోపలికి, 30 అడుగుల ఎత్తులో పోసిన మట్టిని తొలగించింది. మట్టిని తొలగించామని రాజ పుష్ప సిబ్బంది హైడ్రా అధికారులకు సమాచారం ఇచ్చారు.. దీంతో తిరిగి రంగనాథ్ గురువారం నాడు ఆ మట్టి తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించారు.
మట్టిని తొలగించడాన్ని స్వయానా చూసి అధికారులను అభినందించారు. ఇదే సమయంలో మూసి నదికి అడ్డుగా ఎటువంటి కట్టడాలు, పూడ్చివేతలు ఉన్నా సహించబోనంటూ రాజపుష్ప యాజమాన్యాన్ని హెచ్చరించారు.