బిఆర్ ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ కు గుడ్ బై చెప్పారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బంజారాహిల్స్ లోని పోచారం నివాసానికి వెళ్లారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. స్వయంగా సీఎం రేవంత్ ఆహ్వానించడంతో ఆయన కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి పోచారంకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా హస్తం గూటికి చేరారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ..
పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినట్లు సీఎం రేవంత్ చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి తమ ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. పోచారానికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. పోచారం లాంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల రాష్ట్ర అభివృద్ధి సహాయపడుతుందని అన్నారు. పోచారం అనుభవాలను ప్రభుత్వం ఉపయోగం చేసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వంలో వారి సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు.