ముందుగా ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు
ఇప్పటికీ రేషన్ కార్డులేని వారికి కొత్త కార్డులు
దరఖాస్తులు చేసుకోవడం నిరంతర ప్రక్రియ
నాలుగు పథకాల అమలుపై ఉప ముఖ్యమంత్రి భట్టి
హైదరాబాద్ – అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి పథకాలు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ ప్రక్రియ మార్చి నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ తో నాలుగు పథకాలు అమలుపై జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ యోగ్యమైన ప్రతీ ఎకరానికి రైతు భరోసా ఇస్తామని అన్నారు. ఉపాధి హామీలో నమోదై, కనీసం ఇరవై రోజులు పని చేసిన వారికి ఆత్మీయ భరోసా అందిస్తామని పేర్కొన్నారు… రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు జనవరి 26న ఇస్తామని ఇంతకు ముందే ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
లబ్దిదారులు ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించామని వెల్లడించారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు అందరికి ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.. గ్రామసభల్లో ఇండ్లు, రేషన్ కార్డుల కోసం లక్షలాది దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.
జనవరి 26 పరమ పవిత్రమైన రోజు… భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన వాగ్దానం ప్రకారం లాంఛనంగా పథకాలు ప్రారంభిస్తాం. మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని ఈ 4 పధకాలు ఇస్తాం.” అని భట్టి విక్రమార్క తెలిపారు
మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. “రాష్ట్రంలో రేపు నాలుగు సంక్షేమ పథకాలు మండలంలోని ఒక గ్రామంలో మధ్యాహ్నం 1 గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తాం. రేషన్ కార్డులు, ఇండ్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఇస్తాం. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. గతంలో దరఖాస్తు ఇచ్చినా, సర్వేలో వివరాలు ఇచ్చినా… ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోక పోయినా ఇప్పుడు ప్రజాపాలన కేంద్రాల్లో ఇవ్వండి. దారిద్ర్య దిగువున ఉన్న కుటుంబాలందరికి రేషన్ కార్డులు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. గత పదేళ్ళుగా దొడ్డు బియ్యం ఇచ్చారు. మనిషికి ఆరు కిలోల సన్న బియ్యం రేషన్ కార్డు ద్వారా అందిస్తాం. ఇకపై బయట ఆహార పదార్థాలు కోనుక్కోవాల్సి ఉండదని నేను అనుకుంటున్నాం.” అని మంత్రి తెలిపారు.