Tuesday, November 5, 2024

TG – నెగ్గిన ఆదిలాబాద్ మున్సిప‌ల్ వైస్ ఛైర్మ‌న్ పై అవిశ్వాసం తీర్మానం

పంతం నెగ్గించుకున్న‌బీఆర్ ఎస్ –
బీఆర్ ఎస్‌కు బీజేపీ తోడు
నైరాశ్యంలో కాంగ్రెస్‌
న‌లుగురు కౌన్స‌ల‌ర్ల‌పై స‌స్పెన్ష‌న్ వేటు
ఆవిశ్వాసానికి అనుకూలంగా 34 ఓట్లు

ఆంధ్రప్రభ స్మార్ట్, ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్‌ప‌ర్స‌న్‌ జహీర్ రంజానీపై బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. బీజేపీకి చెందిన తొమ్మిది మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి ఓటు వేయడంతో కాంగ్రెస్‌కు కంగుతింది. ఈ విష‌యంలో బీజేపీ తోడు కావ‌డంతో బీఆర్ ఎస్ నాయ‌కులు త‌మ‌ పంతం నెగ్గించుకున్నారు.

- Advertisement -

అవిశ్వాసానిక అనుకూలంగా 34 ఓట్లు

మున్సిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ ఎస్ ఇచ్చిన వైస్ చైర్‌ప‌ర్స‌న్ జ‌హీర్ రంజానీపై అవిశ్వాస తీర్మానం నోటీసు మేర‌కు ఓటింగ్ నిర్వ‌హించారు. మొత్తం 49 మంది కౌన్సిల్ సభ్యులు ఉన్న మున్సిపాలిటీలో అవిశ్వాసానికి అనుకూలంగా 25 మంది కౌన్సిల‌ర్లు, తొమ్మిది మంది బీజేపీ కౌన్సిల‌ర్లు ఓటు వేశారు. కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో అవిశ్వాసం నెగ్గినట్టు, వైస్ చైర్మన్ జహీర్ రంజాన్ పదవి కోల్పోయినట్టు ఆర్డీవో ప్రకటించారు.

నెగ్గించుకున్న బీఆర్ ఎస్‌ పంతం
ఇటీవ‌ల కాంగ్రెస్‌లోకి చేరిన ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ను గద్దె దించాలన్న లక్ష్యంతో బీఆర్ ఎస్ నేత‌, మాజీ మంత్రి జోగు రామన్న అప్ర‌మ‌త్త‌మై బీఆర్ ఎస్ కౌన్సిల‌ర్ల‌ను క్యాంపుకు త‌ర‌లించారు. బీజేపీ కూడా అవిశ్వాసానికి మద్దతు పలుకుతుందని తెలియడంతో వ్యూహాత్మకంగా పార్టీ అధినేత కేసిఆర్ తమ సభ్యులకు విప్ జారీ చేస్తూ క‌లెక్ట‌ర్‌కు నోటీసు పంపించారు. కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి రంగంలోకి దిగి 15 మంది కౌన్సిలర్లను శిబిరాలకు తరలించగా పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి కూడా విప్ జారీ చేయడం ఆసక్తిని రేపింది. సరిగ్గా 11 గంటలకు ఎమ్మెల్యే పాయల్ శంకర ఆధ్వర్యంలో బీజేపీ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రీమియర్ ఆధ్వర్యంలో 25 మంది బీఆర్ ఎస్‌ కౌన్సిలర్లు క్యాంపు నుండి నేరుగా సమావేశానికి చేరుకున్నారు. సంఖ్యా బలం 34 చేరుకోవడంతో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఓటు హక్కు వినియోగించుకోలేదు.

నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల పై సస్పెన్షన్ వేటు
పార్టీ ఆదేశాలను ధిక్కరించి అవిశ్వాసానికి మద్దతు పలికిన కాంగ్రెస్‌కు చెందిన నలుగురు కౌన్సిలర్లను ఆరేళ్ల పాటు సస్పెన్షన్ వేటు విధిస్తున్నట్టు కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు జి. నగేష్ మీడియా సమావేశంలో ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement