మంచి చేస్తున్నా ప్రభుత్వంపై విమర్శలు
రైతులకు న్యాయం చేస్తున్నది మేమే
ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో ధాన్యం పంట
వడ్లు కొన్న అయిదు రోజులలోనే రైతుల ఖాతాలలో డబ్బు
సన్న బియ్యంకు బోనస్ ఇస్తున్నాం
కావాలనే విపక్షాల ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు
మీడియా సమావేశంలో మంత్రులు తుమ్మల, దుద్దిళ్ల
హైదరాబాద్ – రాష్ట్రంలో ఆధిపత్యం కోసం బీఆర్ఎస్ , బీజేపీ లు రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సచివాలయంలో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ధాన్యం కోనుగోలు కొనసాగుతోందని అన్నారు. అయినా బీజేపీ రైతులను ఆగం చేసేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ధాన్యం, పత్తి కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామని పేర్కొన్నారు. ప్రభుత్వం తప్పు చేసిందని నిరూపిస్తే.. సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి సాధించామని పేర్కొన్నారు. 40 లక్షల ఎకరాల్లో రైతులు సన్న వడ్లను పండించారని తెలిపారు. 28 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయని అన్నారు. ఇప్పటి వరకు ఈ ఏడాది 9.5 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వారి ఇటీవల ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే రైతు భరోసా కూడా ఇస్తామని అన్నారు. రైతుల మధ్య చిచ్చుపెట్టి శునకానందం పొందకూడదని ప్రతిపక్షాలకు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు.
కెసిఆర్, కెటిఆర్ లవి మొసలి కన్నీళ్లు ..
కేటీఆర్.. కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయిందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు. ఆయన కార్యాలయంలో నేడు మీడియాతో మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం నిధుల కొరత ఉన్నా రైతు రుణమాఫీ చేశామన్నారు. సన్నవడ్లు పండించిన రైతులకు రూ. 500 బోనస్ ఇస్తున్నామన్నారు. ఇప్పటికి33 కోట్ల రూపాయిల బోనస్ ఇచ్చామన్నారు.
ప్రతి పక్షాలు బోనస్ ఇవ్వడం లేదని రైతులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు మండి పడ్డారు. బోనస్ విషయంలో రైతులు ఎలాంటి అపోహలకు పోవద్దని ఆయన తెలిపారు. ధాన్యం కొన్న ఐదారు రోజులకే బోనస్ ఇస్తున్నామన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు రైతులను అన్యాయం చేశారంటూ ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకునే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.