చదువుల తల్లికి మంత్రి కోమటిరెడ్డి అండ
సుమలతకు ఆర్థిక సాయం అందించిన మంత్రి
నర్సాపూర్ : చదువుల తల్లి సుమలతకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అండగా నిలిచారు. ఆమె ఎంబీబీఎస్ చదువు పూర్తయ్యే వరకు ఫీజు చెల్లించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్పూర్ భద్యతండాకు చెందిన కాట్రోత్ శివరాం, గంసీల కూతురు కాట్రోత్ సుమలతకు ఎంబీబీఎస్ సీటు వచ్చినా ఆర్థిక ఇబ్బందులతో కూలి పనులకు వెళ్తోందని వార్తలు వచ్చాయి.
దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించి సుమలత, ఆమె తండ్రి శివరాంను హైదరాబాద్‌లోని తన ఇంటికి పిలిపించుకుని మంత్రి మాట్లాడారు. సుమలత చదువుకు ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ ద్వారా వైద్య కళాశాలకు రూ.1.5 లక్షలు చెల్లించారు. ఇతర ఖర్చులకు రూ.50 వేలు అందజేశారు. సుమలత ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాగా చదివి వైద్యురాలిగా ప్రజలకు సేవ చేయాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రికి సుమలత తండ్రి శివరాం కృతజ్ఞతలు తెలిపారు.