Friday, October 18, 2024

TG – క్రిశాంక్‌కు మెయిన్‌హార్ట్ సంస్థ లీగ‌ల్ నోటీస్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ నేత మ‌న్నె క్రిశాంక్‌కు మెయిన్‌హార్ట్ సంస్థ లీగ‌ల్ నోటీసులు జారీ చేసింది. మూసీ ప్రాజెక్టు క‌న్స‌ల్టెన్సీ విష‌యంలో నిరాధార ఆరోప‌ణ‌లు చేశారంటూ నోటీసుల్లో పేర్కొంది. దురుద్దేశంతో త‌మ కంపెనీ ప్ర‌తిష్ఠ దెబ్బ‌తినేలా ఆరోప‌ణ‌లు చేశార‌ని మెయిన్‌హార్ట్‌ సంస్థ తెలిపింది. క్రిశాంక్ త‌న వ్యాఖ్య‌ల‌ను 24 గంట‌ల్లోపు ఉప‌సంహ‌రించుకుని క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని, ఎక్స్‌లో పెట్టిన పోస్టుల‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేసింది. లేనిప‌క్షంలో సివిల్, క్రిమిన‌ల్ ప‌రంగా న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు వెళ్తామ‌ని మెయిన్‌హార్ట్‌ సంస్థ హెచ్చ‌రించింది.

వెనక్కి తగ్గేదేలా…

మెయిన్‌హార్ట్‌ సంస్థ ఇచ్చిన నోటీసుల‌పై బీఆర్ఎస్ నేత మ‌న్నె క్రిశాంక్ స్పందించారు. మూసీ కాంట్రాక్టుపై ఎక్స్ పోస్టుల‌ను తొల‌గించే ప్ర‌శ్న ఉత్ప‌న్నం కాదు అని స్ప‌ష్టం చేశారు. నోటీసులు విష‌య‌మై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో చ‌ర్చించిన‌ట్లు పేర్కొన్నారు. సింగ‌పూర్ కంపెనీ ఇచ్చిన నోటీసుల‌కు బీఆర్ఎస్ లీగ‌ల్ సెల్ స‌మాధానం ఇస్తుంద‌ని తెలిపారు. రూ. 3 వేల కోట్ల కుంభ‌కోణంలో మెయిన్‌హార్ట్‌కు పాకిస్తాన్ రెడ్ వారెంట్ నోటీసులు జారీ చేసింది నిజం కాదా..? మెయిన్‌హార్ట్‌ను ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నిషేధించింది నిజం కాదా..? అని క్రిశాంక్ ప్ర‌శ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, మూసీ కాంట్రాక్ట‌ర్ సింగ‌పూర్ కంపెనీ నోటీసుల‌కు, పోలీసు కేసుల‌కు భ‌య‌ప‌డ‌మ‌ని క్రిశాంక్ తేల్చిచెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement