Tuesday, November 19, 2024

TG – రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న – విప‌క్షాల‌పై ఉప మ‌ఖ్య‌మంత్రి భ‌ట్టి ఆగ్ర‌హం

ఉక్కు మ‌హిళ.. ఇందిరాగాంధీ
దేశం కోసం ప్రాణాలు అర్పించారు
దేశం కోసం త‌న జీవితం అంకితం చేశారు
స‌మ‌గ్ర‌త‌కు, స‌మానాత్వానికి ప‌రిత‌పించారు
నిరుపేద‌ల జీవితాల్లో వెలుగులు నింపారు
అక్క‌డి అమాయ‌కుల‌ను మాట‌ల‌తో ప్రేరేపించారు
ఇందిరా వ‌ర్ధంతి సంద‌ర్భంగా డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : రాజకీయ లబ్ధి కోసమే ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌కు కార‌ణ‌మ‌ని, అక్క‌డ అమాయ‌కుల‌ను రెచ్చ‌గొట్టి అధికారుల‌పై దాడుల‌కు ప్రేరేపించార‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్క‌మార్క విపక్షాల‌పై విరుచుకుప‌డ్డారు. ఉక్కు మ‌హిళ ఇందిరాగాంధీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా గాంధీభ‌వ‌న్‌లో నేడు మీడియాతో మాట్లాడుతూ, గ‌త ప్ర‌భుత్వంలో లాగా రైతుల నుంచి బలవంతంగా భూములను ప్రజా ప్రభుత్వం లాక్కోవడం లేద‌న్నారు. రాష్ట్రంలో అసైన్ చేసిన 24 లక్షల ఎకరాల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పదివేల ఎకరాలకు పైబడి రైతుల నుంచి బలవంతంగా గుంజుకొని లే అవుట్ చేసి అమ్ముకున్న దుర్మార్గులు మీరు కాదా? అని ప్ర‌శ్నించారు.

లగచర్లలో హింసను ప్రేరేపించి దాడులకు పురిగొల్పుతున్నది మీరు అంటూ బిఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. అభివృద్ధి జరగాలని ఆలోచన చేస్తున్నది సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. భూములు కోల్పోయే వారిని అన్ని రకాలు ఆదుకుంటామన్నారు భట్టి విక్రమార్క. అందరికీ నచ్చ చెప్పే పరిశ్రమలకు భూమి తీసుకుంటామన్నారు. కొద్దిమంది రాజకీయ నేతలు కుట్రలతో అమాయకులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.

దేశం కోసం ఇందిరాగాంధీ జీవితం అంకితం .

- Advertisement -

దేశం కోసమే మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ త‌న జీవితాన్ని అంకితం చేశార‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. భారతదేశాన్ని అస్థిరపరచాలి, దేశాన్ని విభాజించాలి అనుకునేవాళ్లు ఇందిరా చరిత్రను వక్రీకరిస్తున్నార‌ని అన్నారు. దేశ స‌మైక్య‌త‌, సమగ్రత కోసం ఇందిరా గాంధీ త‌న ప్రాణాలను తృణప్రాయంగా అర్పించార‌ని గుర్తు చేశారు.

20 సూత్రాల‌తో స‌మాజానికి పునాదులు

దివంగ‌త ప్ర‌ధాని ఇందిరా గాంధీ భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, 20సూత్రాల అమలుతో సమసమాజానికి పునాదులు వేశార‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. విదేశీ విధానంలో ఔనత్యాన్ని తీసుకువచ్చి ప్రపంచంలో భారత్‌ను గొప్ప దేశంగా నిల‌బెట్టార‌ని గుర్తు చేశారు. దేశం కోసం జాతి కోసం నిత్యం పరితపించిన ప్రజా నాయకురాలు ఇందిరా గాంధీ అన్నారు. దేశ సుస్థిరత కోసం ఆమె చివరి రక్తపు బొట్టు ఉపయోగపడుతుందని చాటి చెప్పిన ఉక్కు మహిళ అని అన్నారు.

పేద‌ల్లో వెలుగులు నింపారు..

ఇందిరాగాంధీ భార‌త‌దేశంలో పుట్టడం దేశ ప్రజలందరికీ గర్వకారణమ‌ని భ‌ట్టి అన్నారు. అనేక సంస్థలు తీసుకువచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపార‌ని, అందుకే ఇందిరా గాంధీ మార్గాన్ని ప్రజా ప్రభుత్వం అనుసరిస్తోంద‌న్నారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అభివృద్ధిలో అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల ముందు చెప్పామ‌న్నారు. ఈ ఏడాది కాలంలో చేసి చూపిస్తున్నామ‌ని అన్నారు. ఇందిరా స్ఫూర్తితోనే రాహుల్ గాంధీ దేశంలో కులగణన సర్వే జరగాలని ఎన్నికల్లో చెప్పిన విధంగా కులగణన సర్వేను ప్రారంభించామ‌ని అన్నారు. రాష్ట్రంలో కులగణన నిబద్ధతతో, శాస్త్రీయంగా జ‌రుగుతుంద‌ని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం తయారు చేసే ప్రణాళికలకు ఈ సర్వే దోహదపడుతోంద‌న్నారు. కుల గణన సర్వే పూర్తి తర్వాత ప్రజా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో దేశానికి ఈ రాష్ట్రం రోల్ మోడల్ గా ఉండబోతుంద‌ని చెప్పారు.

ఇందిర‌మ్మ స్ఫూర్తితోనే మ‌హిళ‌ల‌కు ప‌థ‌కాలు

ఇందిరమ్మ స్ఫూర్తితో మహిళలకు పథకాలు అందిస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఫ్రీ బస్సు కోసం నెలకు రూ. 400 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఆశయ స్పూర్తితో ముందుకెళ్తున్నామన్నారు భట్టి. గతం తెలియని వారే ఇందిరమ్మ చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. దేశాభిమానం లేనివారే ఇందిరమ్మపై విమర్శలు చేస్తున్నారన్నారు. దేశం కోసం ప్రాణాలను తృణపాయంగా వదిలేసిన గొప్ప చరిత్ర ఇందిరా ఫ్యామిలీదన్నారు.

బలహీన వర్గాల కోసమే సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నామన్నారు భట్టి. రాష్ట్ర ప్రజలందరికీ వనరులు అందజేయడానికే సర్వేచేస్తున్నామన్నారు భట్టి. యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు సమానంగా అందాలనేది సర్వే ఉద్దేశమన్నారు.

బీజేపీ నేతలు ఊహల్లో బతుకుతున్నారని.. దేశాన్ని విభజించి రాజకీయంగా లబ్ధి పొందే కుట్రపన్నుతున్నారని విమర్శించారు భట్టి. బీజేపీ చెప్పిన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పేదల అకౌంట్లో 15 వేలు వేస్తామని మోసం చేశారన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత కాంగ్రెస్ దన్నారు. జాబ్ క్యాలెండర్, యూపీఎస్ సీ తరహాలో ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. వరంగల్ లో ఇందిరా శక్తిని చాటి చెబుతామన్నారు భట్టి.

Advertisement

తాజా వార్తలు

Advertisement