Thursday, November 14, 2024

TG – అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరు – రైతులకు అండగా మేమున్నాం: కేటీఆర్

హైదరాబాద్ – అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరని, బెదిరింపులతో రైతులను భయపెట్టలేరని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రేవంత్ సర్కార్ ను హెచ్చరించారు. లగచర్ల కు అర్దరాత్రి 300మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేస్తారా? రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా? అంటూ నిలదీశారు.

ఈ మేరకు ఆయన ఎక్స్ లో ట్వీట్ చేసారు ఇదేనా ప్రజాస్వామ్య పాలనా?రైతు సంక్షేమ పాలన?ఇదేనా వెలుగులను తరిమేసి.. చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం ! అని ఫైర్ అయ్యారు.అర్దరాత్రి అన్నదాతల అరెస్టులు ఎందుకు?ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి..పచ్చని పొలాలను వల్లకాడు చేయవద్దన్నందుకు రైతుల అరెస్టులా. మీ అల్లుడు, సోదరుల సంపాదనల కోసం..భూమిని నమ్ముకున్న మా పొట్ట కొట్టవద్దన్నందుకు అరెస్టులా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

రైతుల అరెస్టులను ఖండిస్తున్నామని,పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు లగచర్ల గ్రామస్తుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నా అంటూ అక్కడి రైతులకు భరోసా ఇచ్చారు కేటీఆర్.

ఏడాదిలోనే ఎదురీదుతున్న పాలన

’ఏడాదిలోనే ఎదురీదుతున్న పాలన’ అని కేటీఆర్‌ విమర్శించారు. ‘ఆంక్షలు పెట్టి..ప్రజాకాంక్షలను తొక్కేస్తామంటే తెలంగాణ నేల ఊరుకోదు.. తిరగబడుతుంది.. తరిమికొడుతుంది.. తస్మాత్‌ జాగ్రత్త!’ అని హెచ్చరించారు. ఈ మేరకు మరో ట్వీట్ చేసారు ఫార్మా రైతులకు న్యాయం చేస్తామని కబుర్లు చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి సెక్యూరిటీ లేకుండా తన సొంత మండలం దుద్యాలకు వచ్చే దమ్ముందా? అని ప్రశ్నించారు.

- Advertisement -

రేవంత్‌రెడ్డి మోసాలకు అధికారులు ఎందుకు బలి పశువులను చేస్తున్నారని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూర్ఖత్వం వల్లే అధికారులు దెబ్బలు తినాల్సి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు.రాష్ట్రంలో పరిపాలన, శాంతిభద్రతల వైఫల్యానికి తాజా ఉదాహరణే రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఏకంగా జిల్లా కలెక్టర్‌పైకి రైతుల తిరుగుబాటు అని తెలిపారు. రేవంత్‌రెడ్డి దురాశ, అవగాహనా రాహిత్యం వల్లే ఈ దుస్థితి దాపురించిందని చెప్పారు.

భూసేకరణ పూర్తయి, అన్ని అనుమతులు వచ్చి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫార్మాసిటీని రద్దుచేసి, రాష్ట్రంలో పది చోట్ల ఫార్మా క్లస్టర్లు పెట్టాలనే రేవంత్‌రెడ్డి తుగ్లక్‌ అలోచనే ఈ అలజడికి కారణమని విశ్లేషించారు.ఫార్మా సిటీకోసం సేకరించిన భూములను అమ్ముకొని సొమ్ముచేసుకుందామనుకున్న రేవంత్‌ కుత్సిత బుద్ధితో ఇప్పుడు ఫార్మాసిటీ భవితవ్యం ప్రమాదంలో పడిందని, కొడంగల్‌లో అన్నదాతల భూములు గుంజుకునే కుట్ర మొదలైందని విమర్శించారు.

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నదని, అనేకచోట్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నదని, అదికాస్తా కాంగ్రెస్‌ అసమర్థ ప్రభుత్వాన్ని త్వరలోనే భూస్థాపితం చేస్తుందని పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement