ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్: కదులుతున్న ఆర్టీసీ బస్సు ఎక్కిన ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో అతడికి మహిళా కండక్డర్ సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడారు. జీడిమెట్ల ఆర్టీసీ డిపోనకు చెందిన బస్సు నర్సాపూర్ నుంచి గండిమైసమ్మ వైపు బయలు దేరింది. ఐడీపీఎల్ సిగ్నల్ సమీపంలోకి రాగానే మురళీ కృష్ణ(67) అనే వృద్ధుడు రన్నింగ్ బస్సు ఎక్కి సీట్లో కూర్చున్నాడు. వెంటనే అతడికి గుండె నొప్పి వస్తోందంటూ బస్సులోనే కుప్పకూలిపోయాడు. దీంతో బస్సులోని మహిళా కండక్టర్ అంజలి బస్సు ఆపించి చాతిపై నొక్కుతూ సీపీఆర్ చేశారు. ఆమెతో పాటు మరో ప్రయాణికుడు సహాయం చేయడంతో కొద్దిసేపటికి వృద్ధుడు స్పృహలోకి వచ్చాడు.
అభినందించిన డాక్టర్లు..
ప్రయాణికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది అంబులెన్స్‌లో బాధితున్ని స్థానిక సూరారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. సీపీఆర్ తో ప్రాణాలు కాపాడిన మహిళాకండక్టర్ తో పాటు తోటి ప్రయాణికుడిని వైద్యులు, జీడిమెట్ల బస్ డిపో మేనేజర్ ఆంజనేయులు, ప్రయాణికులు అభినందించారు.
సత్కరించిన ఆర్టీసీ ఎండి
బస్సులో గుండెపోటు వచ్చిన ప్రయాణికుడికి సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించిన తమ సిబ్బందిని ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్‌లో శనివారం జీడిమెట్ల డిపోనకు చెందిన కండక్టర్ అంజలి, డ్రైవర్ సైదులును ఉన్నతాధికారులతో కలిసి ఎండీ వీసీ సజ్జనర్ ఘనంగా సన్మానించారు.
సమయస్పూర్తితో వ్యవహారించి.. ప్రయాణికుడికి సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించిన కండక్టర్ అంజలి, డ్రైవర్ సైదులును ఈ సందర్భంగా సజ్జనర్ మెచ్చుకున్నారు. ఆపద సమయంలో సేవా తర్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం గొప్ప విషయమని అన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. వారి ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్, చీఫ్ పర్సనల్ మేనేజర్ ఉషాదేవి, జీడిమెట్ల డిపో మేనేజర్ అంజనేయులు, తదితరులు ఉన్నారు.