హైదరాబాద్: రౌడీయిజం ప్రొత్సహించే చిత్రాలకు సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించాలని అభిప్రాయపడ్డారు సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు. ఇదే క్రమంలో సామాజిక సందేశాత్మక చిత్రాలకు సెన్సార్ బోర్డు అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నదని ఆరోపించారు.. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను నేటి ఉదయం కూనంనేని పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి ఆయన ధైర్యం చెప్పారు..
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీతేజ పరిస్థితి కొంత విషమంగా ఉన్నప్పటికీ వైద్యుల నిరంతర పర్యవేక్షణలో క్రమక్రమంగా కోటుకుంటున్నాడని తెలిపారు. పోలీసులు సంధ్య థియేటర్ వద్ద సకాలంలో స్పందించి శ్రీ తేజకు సీపీఆర్ చేయడంతో బాబు ప్రాణాలు దక్కాయని వైద్యులు చెప్పారు.
ఇక సంధ్య ధియేటర్ తొక్కిసలాట అంశం సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య వివాదంగా మారిందన్నారు. ఇటువంటి ఘటనలను రాజకీయం చేయడం మానుకోవాలని ఇరు వర్గాల హితవు పలికారు.. ఇక సినిమా రంగంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. సినిమాల్లో విలన్లను హీరోలుగా చిత్రీకరించే పద్ధతిలో మార్పు రావాలన్నారు కూనమనేని.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వివరించారని, దీనిని మరింత పెద్దది చేయవద్దని కోరారు.. బౌన్సర్లు గూండాల మాదిరిగా వ్యవహరించడం మూలంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.ఈ . ఈ బౌన్సర్ల వ్యవస్థను రద్దు చేయాలని కమ్యూనిస్టు పార్టీ తరఫున మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన విజ్ఞప్తి చేశారు.