Monday, November 25, 2024

TG – సాగుకు మా పాల‌న‌లో స్వ‌ర్ణ‌యుగం…

మీ పాల‌న‌లో రాతి యుగం
రేవంత్ స‌ర్కార్ పై విరుచుకుప‌డ్డ కెటిఆర్
ఈ ఏడాదిలో ఏకంగా త‌గ్గిన 15.30 లక్షల ఎకరాల్లో విస్తీర్ణం
అన్న‌పూర్ణ తెలంగాణాలో ఏమిటీ దుస్థితి
బుర‌ద రాజ‌కీయాలే త‌ప్ప సాగుకు నీళ్లీచ్చే సోయలేదు

ఆంధ‌ప్ర‌భ స్మార్ – హైద‌రాబాద్ – కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగంగా ఉండేద‌ని, అదే కాంగ్రెస్‌ పాలనలో వ్యవసాయానికి గడ్డుకాలం వచ్చిందని దుయ్య‌బ‌ట్టారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్. ఈ మేర‌కు ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిగా ట్విట్ చేశారు. ఏడాది కాలంలోనే రాష్ట్రంలో 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గింద‌ని విమ‌ర్శించారు. దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన రాష్ట్రంలో ఎనిమిది నెలల్లోనే ఎందుకింత విధ్వంసం అని ప్రశ్నించారు.

సంతోషంగా సాగిన సాగులో ఎందుకింత సంక్షోభం అని మండిప‌డ్డారు. కాంగ్రెస్‌ పాలనలో రైతులకు భరోసానే లేకుండా పోయింద‌న్నారు. రుణమాఫీ అని మభ్య పెట్టి పెట్టుబడి సాయన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థ అని తెలిపారు. బురద రాజకీయాలు తప్ప సమయానికి సాగు నీళ్లిచ్చే సోయి అసలే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం మాటలు కోటలు దాటుతున్నయ్, కానీ చేతలు మాత్రం సచివాలయం గేటు దాటడం లేదని ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితి అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అప్పుల బాధతో అన్నదాతల ఆత్మహత్యలు, కౌలు రైతుల బలవన్మరణాలు అంటూ ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement