హైదరాబాద్ – కెమెరాల ముందు హడావుడి చేయడంతో సరిపెట్టకుండా గురుకులాల బిడ్డల గుండె చప్పుడు వినాలని, గురుకులాల్లో సమస్యలను పరిష్కరించాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరారు.. తెలంగాణలోని గురుకులాలను, హాస్టళ్లను నేడు రేవంత్ సహా అయన కేబినెట్ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు నేడు సందర్శించి అక్కడి విషయాలను తెలుసుకుంటున్న నేపథ్యంలో కెటిఆర్ ట్విట్ చేశారు.. దొంగలు పడ్డ ఆరు నెలలకు అన్నట్లు పాలకులు ఇప్పుడు గురుకులాలను సందర్శించడం రేవంత్ మొదలుపెట్టారని విమర్శించారు. విద్యార్థుల ఆవేదనపై బీఆర్ఎస్ కల్పించుకుని గురుకులాల బాట పట్టడంతో ఎట్టకేలకు ప్రభుత్వంలో చలనం వచ్చిందని అన్నారు. నామమాత్రంగా సందర్శించి, ఫొటోలు దిగి రాకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏడాది పాలనలో సంక్షేమ పాఠశాలలను సంక్షోభంగా రేవంత్ రెడ్డి మార్చేశారని విమర్శించారు పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడంలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. . గురుకులాల విద్యార్థులను తమ హయాంలో ఎవరెస్ట్ ఎక్కించి రికార్డులు సృష్టించేలా చేశామని, రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం విద్యార్థులను ఆసుపత్రి మెట్లు ఎక్కించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో సామాన్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో భయాందోళనలు నింపిందని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. పాఠాలు చెప్పే చోట పాము కాట్లతో పసిబిడ్డల ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.