తెలంగాణలో తిరుగుబాటు – తెలంగాణలో ఉద్యమం నాటి పరిస్థితులు
హామీలను నెరవేర్చకపోవడమే కారణం
ప్రజల పక్షాన పోరాటానికి మేమున్నాం
స్పష్టం చేసిన బీఆర్ఎస్ నేత కేటీఆర్
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్: రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కోసం జనం రోడ్లెక్కుతున్నారు. పది నెలల్లోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న రేవంత్ సర్కార్‌పై ప్రజలు తిరగబడటంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో మరోసారి ఉద్యమం నాటి పరిస్థితులు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీయే మళ్లీ ప్రత్యర్థి అని, ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ ఉన్నదని తెలిపారు. రైతు భరోసా, రైతు రుణమాఫీతో రైతులను దోఖా చేయడం అమానుష మని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దుర్మార్గమంటూ మండిపడ్డారు.
ఉద్యోగాల జాతర హామీకి పాతర..
ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల జాతర అనే హామీకి పాతరేసి నిరుద్యోగుల ఆశలను చిదిమేశారని, రోడ్డెక్కినా కనికరించడం లేదని కేటీఆర్ విమర్శించారు. నాడు బీఆర్ఎస్ హయాంలో సకల జనుల సంక్షేమ తెలంగాణ.. నేడు కాంగ్రెస్ పాలనలో సంక్షోభం వైపు పయనిస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే తెలంగాణ అగ్గై మండుతున్నదని, సర్కార్ విధానాలపై జనం తిరగబడుతున్నారని వెల్లడించారు. తెలంగాణ దళం, గళం ఎప్పటికీ బీఆర్ఎస్సేనని, పేగులు తెగేదాకా ప్రజల కోసం కొట్లాడుతామని స్పష్టం చేశారు. తెలంగాణను అవకాశవాదుల నుంచి కాపాడుకుంటామని తెలిపారు.
తెల్లబంగారం తెల్లబోతున్నది…
పత్తి కొనుగోళ్లలో దళారుల చేతిలో రైతులు చిత్తవుతున్నారంటూ కెటిఆర్ అన్నారు.. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.
” తెల్ల బంగారం తెల్లబోతున్నది బోనస్ దేవుడెరుగు..మద్దతు ధరకే దిక్కులేదు పత్తి రైతు దళారుల చేతిలో చిత్తవుతున్నాడు సీసీఐ కొర్రీలు పెట్టి..సాకులు చూపెట్టి కొనుగోళ్లు నిలిపేసింది రైతన్న ఆగమైతుంటే..పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పత్తా లేదు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని రైతు డిక్లరేషన్‌లో చెప్పి..ఇప్పుడు ఉలుకూ పలుకూ లేకుండా కూర్చున్నది కాంగ్రెస్ సర్కారు. రాష్ట్రంలో వరి తర్వాత రెండో అతిపెద్ద పంట పత్తి.. కీలకమైన కాటన్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చొరవ లేదు..శ్రద్ధలేదు..ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న బుద్ధిలేదు. ఇప్పటికే..దొడ్డు వడ్లకు బోనస్ ఎగ్గొట్టి దగా చేసారు..సన్నాలకు షరతులు పెట్టి కొర్రీలు వేస్తున్నారు..పత్తి రైతును కూడా చిత్తు చేస్తున్నారు. కర్షక ద్రోహి కాంగ్రెస్..రైతు డిక్లరేషన్ బోగస్.” అంటూ ట్విట్ చేశారు.