Friday, November 22, 2024

TG – మోసపు హామీలన్నీ బయటపడుతున్నయ్​ – కెటిఆర్

కౌలు రైతుల‌కు భరోసా లేదట
ఇప్పుడు సాయం చేయ‌లేమ‌ని చేతులెత్తేశారు
వానాకాలం సాగుకు పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు
420 హామీల్లో ఒక్కోదానికి పాతరేస్తున్నారు
సీఎం రేవంత్ మూల్యం చెల్లించుకోక త‌ప్పదు
రైతులకు వెన్నుపోటు పొడవడంపై కేటీఆర్ ఆగ్రహం​

ఆంధ్రప్రభ స్మార్ట్​, హైదరాబాద్​: రైతులకు, కౌలురైతులకు ఇద్దరికీ రైతుభరోసా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ వ‌ట్టిదేనని తేలిపోయింది. ఇద్దరికీ ఇవ్వడం కుదరదని, ఎవరో ఒకరికి మాత్రమే రైతుభరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్ప‌ష్టం చేశారు. ఈ వ్య‌వ‌హారంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. రైతుల‌ను మోసం చేస్తున్న కాంగ్రెస్ స‌ర్కార్‌పై కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటకా బోడి మల్లన్న అన్నట్టుంది కాంగ్రెస్ పాలనా అని తీవ్రంగా విమ‌ర్శించారు. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు ఇప్పుడు. రైతు భరోసా, రుణమాఫీపై ఎన్నికల వేళ‌ బీరాలు పలికి రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాడ‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

- Advertisement -

మంత్రి తుమ్మ‌ల వ్యాఖ్య‌ల‌తో అయోమ‌యం..

తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతన్నలను అయోమయానికి గురిచేస్తున్నాయ‌ని కేటీఆర్ అన్నారు. ‘‘కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని తుమ్మ‌ల చెప్పారు. కౌలు రైతులను నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న రుణమాఫీ పేరిట మోసం చేశారు. నిన్న వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు. నేడు కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా?’’.. అంటూ కాంగ్రెస్ స‌ర్కార్‌ను కేటీఆర్ క‌డిగి పారేశారు.

వారిని అస్సలు వదిలిపెట్టరు..

కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిందేంటి? చేస్తున్నదేంటి? 420 హామీల్లో ఒక్కో వాగ్దానాన్ని సీఎం పాతరేస్తున్నారు? చేతకానప్పుడు హామీలు ఇవ్వడమెందుకు? అధికారంలోకి రాగానే మాట తప్పడమెందుకు? ఇది ముమ్మాటికీ మోసం.. నయవంచన.. తెలంగాణ రైతులు దేన్నైనా క్షమిస్తారు కానీ.. నమ్మించి ద్రోహం చేస్తే ఎట్టిపరిస్థితుల్లో క్షమించరు. గ‌ద్దెనెక్కాక గొంతు కోసిన వారిని అస్సలు వదిలిపెట్టరు. ఈ వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదు అని కేటీఆర్ హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement