Thursday, September 19, 2024

TG – దివ్యాంగుల ఇళ్లు కూల్చేందుకేనా ముఖ్యమంత్రి అయింది … రేవంత్ ను ప్రశ్నించిన కెటిఆర్

నాగర్‌ కర్నూలు : కేవలం 10 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రేవంత్‌రెడ్డి సర్కారు ఎందుకు పూర్తి చేయడం లేదని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రశ్నించారు. ఆ పనులు పూర్తి చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని భయపడుతున్నారా అంటూ ఎద్దేవా చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా నేరెళ్లపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నార్లాపూర్ నుంచి ఉదండపూర్ వరకు దాదాపుగా అన్ని జలాశయాల నిర్మాణం పూర్తి అయిందని, కాల్వలు తవ్వి నీరందిస్తే పాలమూరు పచ్చపడుతుందన్నారు.

గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పిలిచిన కాల్వల టెండర్లను, అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ రద్దు చేసిందని గుర్తు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

మేడిగడ్డకు వెళ్లినట్లుగానే .. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శిస్తామని, పూర్తి అయిన ప్రతీ జలాశయాన్ని ప్రజలకు చూపిస్తామని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ సర్కారు హయాంలో నిరుపేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తే.. కాంగ్రెస్ సర్కారు కూల్చి వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 523 సర్వే నెంబర్‌లో 75 మంది దివ్యాంగుల ఇళ్లను అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడాన్ని ఖండించారు. పేదల ఇళ్లను కూల్చడానికేనా… రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారంటూ నిలదీశారు.

- Advertisement -

ఇళ్లు కోల్పోయిన బాధితులందరికీ తక్షణమే రెండు పడక గదుల ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా ఇళ్లు కూల్చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement