హైదరాబాద్ – తెలంగాణలో గత ఏడాది కాలం నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్రీడీ వ్యూహాంతో ముందుకు వెళ్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. త్రీడీ(3D) వ్యూహం అంటే.. విధ్వంసం(డిస్ట్రక్షన్), దారిమళ్లింపు(డైవర్షన్), దృష్టిమళ్లించడం(డిస్‌ట్రాక్షన్) అని ఆయన పేర్కొన్నారు. ఈ ఐడియాలజీతోనే రేవంత్ ప్రభుత్వం రాజకీయ ప్రతీకారానికి తెగించిందన్నారు. ఆ నెపంతోనే తమపై కేసులు పెట్టినట్లు కేటీఆర్ ఆరోపించారు. కానీ ఏ ఒక్క కేసులోనే పస లేదన్నారు. అన్ని ఉత్తుత్తి కేసులు పెట్టి, న్యాయాన్ని అపహాస్యం చేస్తున్నట్లు విమర్శించారు. ఏసీబీ నమోదు చేసిన కేసులో బలం లేదని సీఎం రేవంత్‌కు తెలుసునని అన్నారు.
తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో తాను ఎక్కడ మాట మార్చలేదని.. చెప్పినదానికే కట్టుబడి ఉన్నానన్నారు. ఈ-కార్ రేసు విషయంలో మంత్రి హోదాలోనే తానే డబ్బులు చెల్లించమన్నానని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం జరుగకపోతే ఈసీ, ఆర్‌బీఐ వద్దకు ప్రభుత్వం ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. డబ్బులు ముట్టిన వారిపై కేసులు ఎందుకు పట్టలేదని నిలదీశారు. ప్రభుత్వం కేసులతో భయపెట్టాలని చూస్తుందని.. వాటిని ఖచ్చితంగా ఎదుర్కొంటామన్నారు. తన కేసుల్లో ఈడీ దూకుడుగా ఉందన్న ప్రచారం జరుగుతోందన్నారు. ఈడీ నుంచి నోటీసు వచ్చిందని.. అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఈ విషయంపై కోర్టుకు చెబుతామన్నారు. కేసులో లేని దూకుడు.. తన విషయంలో మాత్రం అత్యుత్సాహం చూపుతోందని విమర్శించారు. తాను ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తున్నానని.. కోర్టు చెబితే ఈడీ, ఏసీబీ ఇక ఏదీ ఉండదు కదా? అన్నారు.
ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నించారని.. అందులో భాగంగానే ప్రచారం కోసమే సినిమా వాళ్ల గురించి మాట్లాడారని విమర్శించారు. అటెన్షన్, డైవర్షన్ కోసమే సీఎం రేవంత్‌రెడ్డి పాలకులాడారని విమర్శించారు. సినిమా వాళ్లతో సెటిల్మెంట్ చేసుకొని ఇప్పుడు మాట్లాడట్లేదని ఆరోపించారు.
కెసిఆర్ 24 ఏళ్లు కష్టపడ్డారు.. విశ్రాంతి తీసుకుంటున్నారు..
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎప్పుడు ఏ సమయంలో బయటకు రావాలో తెలుసునన్నారు కెటిఆర్ . ఆయన 24 సంవత్సరాలు కష్టపడ్డారని.. ప్రస్తుతం కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారన్నారు. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావుపై కాంగ్రెస్ వివక్ష చూపుతోందని.. ఢిల్లీలో పీవీకి మెమోరియల్ కట్టాలని అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయరు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరణంలో కూడా పీవీని కాంగ్రెస్ గౌరవించలేదని.. పీవీకి గౌరవం దక్కేవరకు రాజ్యసభలో బీఆర్ఎస్ కొట్లాడుతుందని స్పష్టం చేశారు. రేవంత్‌కు బీజేపీ ఎంపీలు రక్షణ కవచంగా మారారని.. అమృత్, సివిల్ సప్లై స్కాంలో కేంద్రం ఎందుకు విచారణ జరుపడం లేదని నిలదీశారు.
సంక్రాంతికి ఇంకో మోసం
రాబోయే సంక్రాంతికి ప్రభుత్వం మరో మోసం చేయబోతుందని.. రైతులకు టోకరా ఇవ్వబోతుందన్నారు. రైతు భరోసా ఇస్తామంటూ ప్రచారం చేస్తుందని.. ఇప్పటి ఈ విషయంలో ప్రభుత్వం వద్ద ఎలాంటి కార్యాచరణ లేదని ఆరోపించారు. కొత్త సంవత్సరం రావడానికి కొద్ది రోజులు మాత్రమే ఉందన్నారు. రైతు రుణమాఫీపై కాంగ్రెస్‌లోని కేడర్ సైతం ప్రశ్నిస్తుందని.. జనాల్లోకి వెళితే ఆరు గ్యారంటీలపైనే అడుగుతున్నారని కేడర్ చెబుతుందన్నారు. ఈ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లను ఇచ్చే ఉద్దేశం లేదని.. వాళ్ల మనిషిని కోర్టుకు పంపి బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవాలని చూస్తుందన్నారు. 2024 సంవత్సరం ఢోకా సంవత్సరంగా ప్రభుత్వం చేసిందన్నారు.