ఇది ఘోర అవమానం అంటూ కెటిఆర్ ఫైర్
తెలంగాణ ఆత్మతో ఆటలా
ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా అంటూ మండి పాటు
హైదరాబాద్ – తెలంగాణ రాజకీయాల్లో విగ్రహాల వివాదం మంటలు రేపు తున్నది. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేడు ఆవిష్కరించబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వివాదం కాస్తా పతాక స్థాయికి చేరింది.
సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నిర్మించడానికి ఇదివరకే రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. నిర్మాణ పనులు సైతం పూర్తయ్యాయి. నేడు ఆవిష్కర కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించబోతోంది. ఈ సాయంత్రం 4 గంటలకు రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విగ్రహాన్నిఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారు.
రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ నెలకొల్పడం రాజకీయంగా దుమారం రేపుతోంది. తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నెలకొల్పడం పట్ల భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్.. తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్‌పై ఘాటు విమర్శలు సంధించారు.
తెలంగాణ తల్లిని అవమానిస్తారా?, తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా?, తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా? అంటూ ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా?, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా?, తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా?, తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా? అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఈ చర్యలకు ప్రతి చర్య తప్పకుండా ఉంటుందని కెటిఆర్ హెచ్చరించారు.