Tuesday, November 26, 2024

TG – రాష్ట్రంలో శాంతి లేదు .. భ‌ద్ర‌త లేదు … రేవంత్ పై కెటిఆర్ ధ్వజం

హోం మంత్రి లేక‌నే దారుణాలు
రోజు రోజుకూ దుర్మార్గులు రెచ్చిపోతున్నారు
జైనూర్ లాంటి ఘ‌ట‌న‌లు బాధాక‌రం
బాధిత మ‌హిళ‌కు న్యాయం జ‌ర‌గాలి
ప‌రిహారం ఇచ్చి త‌ప్పించుకోవాల‌ని చూడ‌డం దారుణం
ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆవేద‌న వ్య‌క్తం చేసిన కేటీఆర్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌:
తెలంగాణ‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి పూర్తిస్థాయి హోం మంత్రి లేక‌పోవ‌డం వ‌ల్లే శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయ‌ని, జైనూర్ లాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయ‌ని అన్నారు. ఈ మేర‌కు జైనూర్ ఘ‌ట‌న‌పై కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఆదివాసీ మ‌హిళ‌పై లైంగిక‌దాడి..

- Advertisement -

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలంలో ఆదివాసీ మహిళపై జరిగిన లైంగిక‌దాడి ఘ‌ట‌న‌ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ జరిగిన హింసాత్మక చర్యల్లో అనేక ఆస్తుల విధ్వంసం జరగడం దురదృష్టకరం. బాధిత మహిళకు కేవలం లక్ష రూపాయల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యత్నించడం దుర్మార్గం. ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయని ముందస్తు సమాచారం ఉన్నా వాటిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కేటీఆర్ మండిప‌డ్డారు.

బాధిత మ‌హిళ‌కు న్యాయం జ‌ర‌గాలి..

జైనూర్‌లో తక్షణమే శాంతి నెలకొనేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బాధిత మహిళకు మెరుగైన వైద్యం అందించాల‌ని కేటీఆర్ అన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాల‌ని, అల్లర్లలో ఇళ్లు, షాపులు కోల్పోయినవారికి సాయంగా నిలవాల‌న్నారు. పూర్తి స్థాయి హోం మంత్రి లేకుండానే తొమ్మిది నెలలుగా రాష్ట్రాన్ని నడపడం వల్లనే తరచూ ఇటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement