ఆ ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది!
ప్రపంచ స్థాయిలో పోటీ పడుతున్న గురుకుల విద్యార్థులు
కేసీఆర్ హయాంలో వెయ్యికి పైగా గురుకుల పాఠశాలల ఏర్పాటు
డూప్లికేటు గాంధీలకు బుద్ధి రావాలి
అబద్దాలు చెబుతున్నసీఎం రేవంత్ రెడ్డి
మా ప్రభుత్వంలో 6.5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మకమని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పడం హస్యాస్పదంగా ఉందని చెప్పారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్వీ క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఆహా నా పెళ్లాంట సినిమాలో కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ పిసినారిగా ఉంటుంది. చికెన్ పెడుతా అని ఇంటికి కొందరిని పిలుస్తాడు. ఇక ప్లేట్‌లో అన్నం, చట్నీ వేసి.. ముందట కోడిని వేలాడదీస్తాడు.. ఇదే చికెన్ అని ఊరిస్తాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు అలాగే ఉంది. ఆరునూరైనా సరే.. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం, చేసి చూపెడుతా అని గంభీరమైన డైలాగులు కొట్టారు. ఇది చేస్తాం.. అది చేస్తాం.. పొడిచెస్తాం అని 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఇవాళ 14వ నెల నడుస్తుంది. ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మీసేవలో దరఖాస్తు చేసుకున్న వారికి 6.5 లక్షల కొత్త రేషన్ కార్డులను ఇచ్చామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం హయాంలో తెలంగాణను దేశానికి దిక్సూచిలా తీర్చిదిద్దామన్నారు. ఇప్పటి వరకు హామీలు అమలు చేయలేదని, ఇందుకు నిరసనగా జనవరి 30న గాంధీ విగ్రహానికి వినతి పత్రాలు ఇస్తామని అన్నారు. డూప్లికేట్ గాంధీలకు బుద్ధి వచ్చేలా చేయాలని ఆ మహాత్ముడిని కోరుతామన్నారు.
ఆ ఘనత కెసిఆర్ దే…..
రాష్ట్రంలోని గురుకుల విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడుతున్నారంటే.. ఆ ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కేటీఆర్ అన్నారు. పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండు సమాంతరంగా ముందుకు పోయిందన్నారు. పరిశ్రమలు, పర్యావరణం, ఐటీ, వ్యవసాయ రంగంలో దేశానికి దిక్సూచిగా నిలిచామని చెప్పారు. విద్యా రంగంలో కేసీఆర్ ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. వెయ్యికి పైగా గురుకులాలను స్థాపించారని, కేసీఆర్ నాయకత్వంలో బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదంటే అది అతిశయోక్తి కానే కాదు అని కేటీఆర్ తెలిపారు.
వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు ప్రారంభం
రాష్ట్రంలో వెయ్యికి పైగా గురుకుల విద్యాసంస్థలు ఏర్పాటు చేశామని కేటీఆర్ అన్నారు. అణగారిన వర్గాలు దళితులు, గిరజనులు, బలహీనవర్గాల పిల్లలకు సకల సౌకర్యాలు కల్పించి ప్రపంచంతో పోటీపడే విధంగా ఏర్పాటు చేశామని చెప్పారు. ఆ ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 60 డిగ్రీ గురుకుల కాలేజీలు, 146 ఉన్న ఇంటర్ రెసిడెన్షియల్ స్కూళ్లను 592కు తీసుకుపోయామని చెప్పారు. మొత్తంగా 294 గురుకులాల నుంచి 1022 చేసుకున్నామన్నారు. మెడికల్ కాలేజీలు కేవలం ఐదు ఉంటే కేసీఆర్ నాయకత్వంలో జిల్లాకు ఒకటి చొప్పున 33 ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు.
మెడికల్ కాలేజీలే కాకుండా నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమైన ఆలోచనలు చేశారని, అటవీ, హార్టికల్చర్, వెటర్నరీ, మహిళా యూనివర్సిటీలు స్థాపించామన్నారు. ఆ యూనివర్సిటీలకు తెలంగాణ ప్రముఖుల పేర్లు పెట్టి గౌరవించుకున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 26 వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలు ఉంటే వాటిని మూడు దశల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించామని చెప్పారు. మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి అనే కార్యక్రమాలకు రూ. 7400 కోట్లతో శ్రీకారం చుట్టామన్నారు. ఒక దశ పూర్తి చేశామని, ఇంతలోనే ప్రభుత్వం మారిందని కేటీఆర్ గుర్తు చేశారు.