Wednesday, November 20, 2024

TG – ముఖ్యమంత్రి గా మీకు “మోకా” ఇస్తే – నిరుద్యోగులకు “డోకా” ఇస్తారా – రేవంత్ పై కేటీఆర్ ఫైర్

హైదరాబాద్ : డీఎస్సీ వాయిదా వేయాలంటూ, పోస్ట్‌లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై అక్రమ కేసులు, నిర్భంధం, అరెస్ట్ చేయటాన్ని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేసారు.

అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ అని చెప్పి ఇప్పుడు వారిని దగా చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి కేబిట్‌లోనే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ అని ఇచ్చిన మాట తొమ్మిది నెలలు కావస్తోన్న ఏమైదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా అని నిలదీశారు.

- Advertisement -

నిరుద్యోగులను రెచ్చగొట్టి మీరు కొలువుదీరితే సరిపోతుందా? యువతకు కొలువులు అక్కర్లేదా ? అని కాంగ్రెస్ సర్కార్‌ను కడిగి పారేశారు. ఉస్మానియా విద్యార్థులన్నా.. అక్కడ నిరసనలు తెలుపుతున్న అభ్యర్థులన్నా సీఎంకు ఎందుకంతా కోపమో చెప్పాలన్నారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా విద్యార్థులు అడ్డమీద కూలీల్లాంటి వారని… తిన్నది అరిగేదాకా అరిచే బీరు బిర్యానీ బ్యాచ్ అని బద్నాం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.

సిద్ధాంతం, ఆలోచన లేని ఆవారా టీమ్ అని వారి అవహేళన చేసిన మీరే…అదే విద్యార్థులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చారన్న సంగతి మర్చిపోవద్దన్నారు.అధికారంలోకి రాగానే నేడు అదే ఉస్మానియా యూనివర్సిటీని రణరంగంగా మార్చి… డీఎస్సీ అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి అణచివేస్తున్నారని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని… వందల మందిని అన్యాయంగా అరెస్టు చేసి అక్రమ కేసులు పెడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజా పాలన అంటే అని ప్రశ్నించారు

. ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశ సరిహద్దుల్లో ఉందా? అక్కడికి అన్ని బలగాలను తెచ్చి ఎందుకంతా నిర్భందాన్ని విధిస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. మళ్లీ ఉస్మానియాలో ఉద్యమం నాటి పరిస్థితులను రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొస్తుందంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ చేతకానితనాన్ని ప్రశ్నించడమే వాళ్లు చేసిన నేరమా? ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగడమే పాపమా? అని రేవంత్ సర్కార్ ను కేటీఆర్ నిలదీశారు.

ముఖ్యమంత్రిగా మీకు మోకా వస్తే.. డీఎస్సీ అభ్యర్ధులకు ఇంత ధోకా చేస్తారని ఊహించలేదన్నారు. ఇప్పటికే మెగా డీఎస్సీ అని.. నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేశారు. ఇప్పుడు ప్రిపరేషన్‌కు కూడా టైమ్ ఇవ్వకుండా.. వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడటం ఎంత వరకు కరెక్ట్ అన్నారు. పరీక్షలు వాయిదా వేయాలంటూ డీఎస్సీ అభ్యర్థులు కోరుతుంటే వారి డిమాండ్‌ను పరిశీలించటంలో ఎందుకింత మొండి వైఖరో చెప్పాలన్నారు. న్యాయమైన డిమాండ్లను ఆడబిడ్డలు అడిగినంత మాత్రాన అర్థరాత్రి వరకు అక్రమంగా నిర్బంధిస్తారా? ఇదేనా మహిళలంటే.. ముఖ్యమంత్రికి ఉన్న గౌరవం అని కేటీఆర్ ప్రశ్నించారు.

అధికారంలోకి రాగానే నోటిఫికేషన్లు.. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామన్నారు. ఇప్పుడు కనీసం సీఎం అపాయింట్మెంట్ కూడా నిరుద్యోగులకు ఎందుకు ఇవ్వడం లేదు. నిరుద్యోగులంతా ఈ ప్రభుత్వం వైఖరిని గమనించాలని కోరారు. పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న దృష్టి.. పోరుబాట పట్టిన నిరుద్యోగులపై లేకపోవడంపై కాంగ్రెస్ సిగ్గుపడాలన్నారు కేటీఆర్..

ఇన్నాళ్లు కాంగ్రెస్ సర్కార్‌ను భుజాన మోసిన సోకాల్డ్ మేధావులు ఇప్పుడు ఎక్కడున్నారని… ప్రశ్నించే గొంతులు ఎందుకు మూగబోయాయో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికైనా డీఎస్సీ పరీక్షల వాయిదా, పోస్టుల పెంపు డిమాండ్లు నెరవేర్చాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ జెండా వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇలాగే మొండి వైఖరి ప్రదర్శిస్తే నిరుద్యోగులతో కలిసి మరో ఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement