న్యూఢిల్లీ: కాంగ్రెస్ అనుసరిస్తున్న ఫిరాయింపులపై సుప్రీం కోర్టు తలుపులు తడతామని, అలాగే స్పీకర్ కు, రాష్ట్రపతిని, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి హరీశ్ రావు, ఎంపీలు సురేశ్ రెడ్డి, దీవకొండ దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్ దాన్ని గాలికి వదిలేసి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నదని మండిపడ్డారు.. ఆయారాం.. గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టింది ఆ పార్టీయేనన్నారు. 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలుమార్లు ఫిరాయింపులను ప్రోత్సహించిందని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు.
ఈ విషయంలో న్యాయనిపుణులు, రాజ్యాంగ నిపుణులతో చర్చించేందుకే తాను, హరీశ్‌రావు రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్నామని వివరించారు. రాజ్యాంగాన్ని కాపాడుతామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు అదే రాజ్యాంగాన్ని అవమానించేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన వారిని రాళ్లతో కొట్టిచంపాలని రేవంత్‌రెడ్డి చెప్పారని.. మరి ఇప్పుడు ఎవరు ఎవరిని రాళ్లతో కొట్టాలో రాహుల్‌గాంధీ చెప్పాలన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు తమ పార్టీకి చెందిన 6 మంది ఎమ్మెల్సీలు, ఏడుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ హయాంలో ప్రజాప్రతినిధుల చేరికలపై మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన కేటీఆర్.. పార్టీ ఫిరాయింపులకు, పార్టీ విలీనానికి తేడా ఉందన్నారు. ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. తమ హయాంలో పార్టీల విలీనం జరిగిందని చెప్పారు. చేరికల విషయంలో నైతికత, అనైతికత అనే దానికంటే జరుగుతున్న చేరికలు చట్టబద్దమా? కాదా? అనేదే ముఖ్యం అన్నారు. నైతికత మాకే కాదు అందరికీ ఉండాలన్నారు. పార్టీ ఫిరాయించిన కేకేపై రాజ్యసభ చైర్మన్ అనర్హత వేటు వేస్తారనే భయంతోనే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారని చెప్పారు. రాష్ట్రంలో అయితే స్పీకర్ నిర్ణయం తీసుకోరనే భావనతో ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం లేదని విమర్శించారు.
తెలంగాణ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమేన్నారు కెటిఆర్ . సీఎం రేవంత్ స్వయంగా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ రక్షణ చేస్తున్నామని ఒక పక్క కాంగ్రెస్ గొప్పలు చెపుతూ ఆయారాం, గయారాం సంస్కృతిని కొనసాగిస్తున్నదని అన్నారు… పార్టీ పిరాయింపులు . ఇప్పుడు అది పోచారం దాకా వచ్చిందని చెప్పారు. ఆటోమేటిక్‌గా అనర్హత వేటు వేసేలా పదో షెడ్యూల్‌కు సవరణలు చేస్తామని కాంగ్రెస్ న్యాయ పత్రలో హామీ ఇచ్చి తెలంగాణలో ఫిరాయింపుల ప్రోత్సహిస్తోందని విమర్శించారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారన్నారు కెటిఆర్ . డిసెంబర్ 9న రుణ మాఫీ చేస్తామని చెప్పారని . ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేరలేదన్నారు… కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను మర్చిపోయి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను తమ గూటికి చేర్చుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోవా, కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తున్నదన్న రాహుల్ గాంధీ ఇప్పుడు తెలంగాణాలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి చేర్చుకుంటుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు కెటిఆర్. మణిపూర్‌లో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే.. ఆ ఎమ్మెల్యేని సుప్రీకోర్టు డిస్‌క్వాలిఫై చేసిందని గుర్తు చేశారు. . ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ పార్టీ ఫిరాయిస్తే వారిని డిస్ క్వాలిఫై అయ్యేలా చట్టం తీసుకురావాలని రాహుల్ చెప్పారని అంటూ పార్లమెంట్‌లో ఆయన రాజ్యాంగాన్ని చూపిస్తారు కానీ ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వరని దుయ్యబట్టారు.. రాజ్యాంగ రక్షకుడిగా రాహుల్ గాంధీ ఆస్కార్ అవార్డు స్థాయిలో నటిస్తున్నారని విమర్శించారు. . ఆచరణలో రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఒక్కో బీఆర్‌ఎస్ ఎంఎల్ఏను కొనడానికి ఎంత ఖర్చు పెడుతున్నారు’ అని కేటీఆర్ ఇటు రేవంత్ ను అటు రాహుల్ ను నిలదీశారు.