Wednesday, September 25, 2024

TG – మూసీ ప్రాజెక్టుకు రూ.లక్షన్నర కోట్లా …. రేవంత్ ను నిల‌దీసిన కెటిఆర్

హైదరాబాద్‌: తమ హయాంలో హైదరాబాద్‌ను మురికి నీటి రహిత నగరంగా మార్చాలనే గొప్ప లక్ష్యంతో ఎస్టీపీ(మురుగు శుద్ధి కేంద్రం)లను ప్రారంభించామని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. ఫతేనగర్‌ ఎస్టీపీ(మురుగు శుద్ధి కేంద్రం)ని ఆ పార్టీ నేతలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులతో కలిసి నేడు పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రాన్ని ఒక విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దాల‌నే దృఢ‌ క‌సంక‌ల్పంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ ప‌రిధిలో ప్ర‌తి రోజు ఉత్ప‌త్తి అయ్యే 20 కోట్ల లీట‌ర్ల మురికి నీటిని సంపూర్ణంగా శుద్ధి చేయాల‌నే ఉద్దేశంతో రూ. 4 వేల కోట్ల‌తో 31 ఎస్టీపీల‌కు శ్రీకారం చుట్టామ‌ని తెలిపారు. అయితే ఈ నిర్మాణంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోందని విమర్శించారు. పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు. తమ హయాంలో మొత్తం 31 ఎస్టీపీల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. రూ.3,866 కోట్లతో మురుగునీటి శుద్ధి కార్యక్రమం ప్రారంభించామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు మూసీ సుందరీకరణ అంటోందని ఎద్దేవా చేశారు.

- Advertisement -

ల‌క్ష కోట్లతో మూసీ ప్ర‌క్షాళ‌నా?
”మూసీ సుందరీకరణ పేరుతో కుంభకోణం జరుగుతోంది. దీని టెండర్లను పాకిస్థాన్‌ కంపెనీలకు కట్టబెడుతున్నారు. ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీరు మూసీ నదిలోకి వెళ్తోంది. 94 శాతం స్వచ్ఛమైన నీరు వెళ్తున్నప్పుడు మళ్లీ శుద్ధి ఎందుకు? ఈ ప్రాజెక్టుకు రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టే అవసరం ఉందా?” అని కేటీఆర్‌ ప్రశ్నించారు. దీని కోసమే రూ.వేలు, లక్షల కోట్లు అంటే అందరికీ అనుమానం వస్తోందన్నారు.

డ‌బుల్ బెడ్ రూం నిర్మాణాల‌పై మీవ‌న్నీ అబ‌ద్దాలే ..
డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క అనేక అబద్ధాలు చెప్పారని విమర్శించారు కెటిఆర్ . ఇప్ప‌టిదాకా మీరు చెప్పిన‌వి అబ‌ద్దాలు అని తేలిపోయింది.. హైద‌రాబాద్‌లో ఒక్క డ‌బుల్ బెడ్రూం ఇల్లు క‌ట్ట‌లేదు అని గ‌తంలో రేవంత్ రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడారు. నాడు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ద‌గ్గ‌రుండి భ‌ట్టికి డ‌బుల్ బెడ్రూం ఇండ్లు చూపించారు. మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో 12 వేల ఆక్ర‌మ‌ణ‌లు ఉన్నాయని సీఎం చెప్పారు. వాటిని తొల‌గించి బాధితుల‌కు డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామ‌ని చెప్పారు. మేం డ‌బుల్ బెడ్రూం ఇండ్లు క‌ట్ట‌క‌పోతే మీరు ఎక్క‌డ్నుంచి ఇస్తున్నారు..? ఇప్ప‌టిదాకా మీరు చెప్పిన‌వి అబ‌ద్దాలు అని తేలిపోయింది. కేసీఆర్ చేసిన మంచి ప‌న‌ని ఒప్పుకోక త‌ప్ప‌ట్లేదు అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

ప‌బ్లిసిటీ స్టంట్ల చేయ‌వ‌ద్దు ..

మాజీ మంత్రి స‌బిత ఇంద్రారెడ్డి నేతృత్వంలో 14 వేల ఎక‌రాలు ఫార్మా సిటీ కోసం సేక‌రిస్తే దాన్ని ర‌ద్దు చేసి ఫ్యూచ‌ర్ సిటీ అని, ఇంకోటి అని ర‌క‌ర‌కాల డ్రామాలు ఆడుతున్నారు. మూసీకి సంబంధించి మూసీ సుంద‌రీక‌ర‌ణ పేరిట కొత్త నాట‌కాలు ఆడుతున్నారు. మీరు ఇచ్చిన హామీల‌ను వెంట‌నే అమ‌లు చేయండి. రైతుభ‌రోసా అందించండి.. ప‌బ్లిసిటీ స్టంట్ల‌తో ఎక్కువ రోజులు మాయ చేయ‌లేరు. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు మేం చేసిన ప‌ని బాగా తెలుసు. లింకు రోడ్లు, ఫ్లై ఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌లు, స్మ‌శాన వాటిక‌లు, లైబ్ర‌రీలు క‌ట్టాం. ఇవ‌న్నీ ప్ర‌జ‌ల దృష్టిలో ఉన్నాయని తెలిపారు. పేద‌ల‌కు ఒక న్యాయం.. పేదోళ్ల‌కు ఒక న్యాయం ఉంది. పేదోళ్ల‌ను బుల్డోజ‌ర్ల కింద న‌లిపేస్తున్నారు. బాధితుల‌కు డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను కేటాయించండి.. ఆల‌స్యం చేయ‌కండి. పుస్త‌కాల కోసం వేద శ్రీ మాట్లాడిన మాట‌లు వింటే గుండె బ‌రువెక్కిపోయింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement