ఇప్పుడు చూడండి మేడిగడ్డ వద్ద గోదావరి గల గల
తెలంగాణకు జీవధార కాళేశ్వరం ప్రాజెక్ట్
కెసిఆర్ పై నిరాధార నిందలు వేసారుగా
దీనికేం సమాధానం చెబుతారు
ట్విట్టర్ వేదికగా రేవంత్ కు కెటిఆర్ ప్రశ్న
ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – తెలంగాణలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో తెలంగాణలోని మేడిగడ్డ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మేడిగడ్డ ఎందుకూ పనికిరాకుండా పోయిందని సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నేతలు, సోషల్ మీడియా చేసిన ప్రచారం పనికిరాకుండా పోయిందని అన్నారు.
కాంగ్రెస్ కుట్రలను తట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచిందని, నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజీ ఉందని చెప్పారు. కాళేశ్వరం కొట్టుకుపోయింది, మేడిగడ్డ కుంగిపోయిందంటూ కాంగ్రెస్ పార్టీ, వందలాది యూట్యూబ్ ఛానళ్లు నెలల పాటు దుష్ప్రచారం చేశాయని… వాళ్ల కుళ్లు, కుతంత్రాలను కడిగేస్తూ లక్షల క్యూసెక్కుల నీరు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తోందని అన్నారు.
కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే… మీరు చరిత్ర హీనులుగా నిలిచిపోవడం ఖాయమని కేటీఆర్ చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణకు జీవధార కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అన్నారు. త్వరలోనే మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తున్నామని తెలిపారు.