Thursday, January 16, 2025

TG – కేసుల విషయంలో లైడిటెక్టర్ పరీక్ష – రేవంత్ కు కేటీఆర్ సవాల్

హైదరాబాద్ – తాను ఏ తప్పు చేయకపోయినప్పటికీ చట్టాలను గౌరవించే వ్యక్తిగా ఈడీ విచారణకు వచ్చానన్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . తాను ఈ-ఫార్ములా రేస్ కేసులో ఒక్క రూపాయి అవినీతి చేయకున్నా విచారణకు హాజరయ్యానన్నారు. ఏసీబీలాగే ఈడీ కూడా విచారణలో అవే ప్రశ్నలు అడిగిందన్నారు. అడిగిన ప్రశ్నలనే తిప్పితిప్పి అడిగారన్నారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానని చెప్పానని వెల్లడించారు. ఈ రోజు కాకున్నా రేపైనా నిజాలు బయటకు వస్తాయన్నారు.

ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ ను ఈడీ అధికారులు నేడు విచారించారు. సుమారు ఏడు గంటల పాటు సాగిన విచార‌ణ అనంత‌రం బయటకు వచ్చిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

సిఎం రేవంత్ రెడ్డిపై ఏసీబీ, ఈడీ కేసులు ఉన్నాయ‌ని చెప్పి.. త‌న‌పై కూడా ఏసీబీ, ఈడీ కేసులు న‌మోదు చేయించి, క‌క్ష సాధింపు చ‌ర్య‌లకు పాల్ప‌డుతున్నారని కేటీఆర్ మండిప‌డ్డారు. ఈ కేసుల్లో వాస్త‌వాలు ఏంటో ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేందుకు తాను లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష‌కు సిద్ధం.. రేవంత రెడ్డి సిద్ధ‌మా..? అని స‌వాల్ విసిరారు. తమపై ఉన్న కేసులకు సంబంధించి తామిరువురం ఒకేచోట కూర్చొని అధికారులు, ప్రజలు చూస్తుండగా ప్రశ్నిస్తే… అప్పుడు దొంగ ఎవరో తేలుతుందన్నారు. జుబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ప్యాలెస్‌లో అయినా లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా లేదా కోర్టులో అయినా లైడిటెక్టర్ పరీక్షలకు తాను సిద్ధమన్నారు. మీరు సిద్ధమేనా? అని సవాల్ చేశారు.

- Advertisement -

తమకు జడ్జిలు, కోర్టులపై నమ్మకం ఉందన్నారు. తాను తప్పు చేయలేదు… చేయబోనని స్పష్టం చేశారు. తప్పు చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement