Monday, July 1, 2024

TG – వ్యవసాయం ఇక‌పై స్మార్ట్‌! – డిజిట‌లీక‌ర‌ణ‌కు స‌న్నాహాలు

వ్య‌వ‌సాయం కూడా స్మార్ట్ కాబోతోంది. అగ్నిక‌ల్చ‌ర్‌ని ప్రోత్స‌హించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేప‌డుతోంది. వ్య‌వ‌సాయాన్ని మ‌రింత ప్రోత్స‌హించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం డిజిట‌ల్ అగ్రిక‌ల్చ‌ర్ మిష‌న్ అనే కార్య‌క్ర‌మాన్ని ప్ర‌వేశ పెట్టింది. ఇది పూర్తి స్థాయిలో అమ‌లైతే రైతులకు ఎన్నో ప్ర‌యోజ‌నాలు ద‌క్క‌నున్నాయి. ప్ర‌ధానంగా పంట‌ల బీమా వ‌ర్తింపు, రుణ ప్రణాళిక రూపొందించేందుకు కీల‌కం కానుంది. ఇక‌.. పైల‌ట్ ప్రాజెక్టు కింద ఆదిలాబాద్ జిల్లా మావ‌ల మండ‌లాన్ని ఎంపిక చేశారు. ప్ర‌స్తుతం సాగు వివ‌రాలు తెలుసుకునేందుకు డిజిట‌ల్ స‌ర్వే చేప‌డుతున్నారు.

డిజిట‌ల్ అగ్రిక‌ల్చ‌ర్ మిష‌న్ అమ‌లుకు కేంద్రం చ‌ర్య‌లు
వ్య‌వ‌సాయ రంగానికి బ‌హుళ ప్ర‌యోజనం
పంట‌లు, రుణ ప్ర‌ణాళిక‌ల‌కు దోహ‌దం
పైల‌ట్ ప్రాజెక్టుకు ఆదిలాబాద్​ జిల్లా మావ‌ల మండ‌లం ఎంపిక‌
సాగు వివ‌రాల న‌మోదుకు డిజిట‌ల్ స‌ర్వే ప్రారంభం

- Advertisement -

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : వ్యవసాయ రంగాన్ని మరింత ప్రోత్సహించి సాంకేతిక రంగాన్ని అమల్లోకి తెచ్చేందుకు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కార్య‌క్ర‌మాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ప్రవేశపెట్టింది. జాతీయ స్థాయిలో పైల‌ట్ ప్రాజెక్టు కింద అమ‌లు చేయ‌డానికి రూ.2800 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. ఈ ప‌థ‌కం ద్వారా రైతులు సాగు చేసే పంట‌లు, సాగు విస్తీర్ణం త‌దిత‌ర అంశాలు క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించి డిజిట‌ల్ విధానంలో న‌మోదు చేయ‌నున్నారు. రైతులకు అందించే సబ్సిడీ పథకాలు, వ్యవసాయ యాంత్రీకరణ కార్యక్రమాలు కూడా పారదర్శకంగా అమలు చేసేందుకు అవకాశం ఉంది. అలాగే రైతుల స‌మ‌స్య‌లు ప‌రిష్కారానికి ఈ కార్య‌క్ర‌మం దోహ‌ద‌ప‌డుతుంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

వ్య‌వ‌సాయ రంగంలో సాంకేతిక విప్ల‌వం

డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ప‌థ‌కం ద్వారా వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవం రానుంది. పంటల సాగు, ఒక్కో రైతుకు క్షేత్రస్థాయిలో పంట విస్తీర్ణం ఎంత ఉందనే అంశంపై డిజిటల్ క్రాప్ సర్వే ను అమలు చేయనున్నారు. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టo (జిఐఎస్), క్యాడస్ట్రల్ (నిర్ణీత సాగు విస్తీర్ణం కలిగిన పంట క్షేత్రం) , గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జిపిఎస్) ద్వారా అధికారులు, సాంకేతిక సిబ్బంది పంట క్షేత్రాల వివరాలు నమోదు చేయనున్నారు. డిజిటల్ క్రాప్ సర్వే ను ఈ ఖరీఫ్ సీజన్ నుండి 12 రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తుండగా, పైలట్ ప్రాజెక్టు అనంతరం పూర్తిస్థాయిలో కార్యాచరణ రూపొందించి అమలు చేయనున్నారు.

బ‌హుళ ప్ర‌యోజ‌నాలు

ఈ ప‌థ‌కం ద్వారా రైతుల‌కు బ‌హుళ ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. సాగు వివ‌రాలు, రైతుల వివ‌రాలు ఆన్‌లైన్‌లో న‌మోదు చేయ‌నున్నారు. వాటి ఆధారంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం ఫసల్ బీమా యోజన త‌దిత‌ర ప‌థ‌కాలను స‌క్ర‌మంగా అమ‌లు చేసే అవ‌కాశం ఉంటుంది. అలాగే రుణ‌, సాగు ప్ర‌ణాళిక‌తోపాటు పంట‌ల ఉత్ప‌త్తిపై నిర్ధ‌ష్ట అంచ‌నాలతో కార్యాచ‌ర‌ణ రూపొందించే అవ‌కాశం ఉంది.

పైలట్ ప్రాజెక్టు కింద ‘మావల’ ఎంపిక

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 17 లక్షల 40 వేల ఎకరాల‌ సాగు విస్తీర్ణం ఉంది. రైతుల వివరాలు, వివిధ రకాల పంటల విస్తీర్ణం నమోదు కోసం డిజిటల్ క్రాప్ సర్వే కింద ఆదిలాబాద్ జిల్లా మావల మండలాన్ని పైలట్ ప్రాజెక్టులో ఎంపిక చేశారు. ఈ విషయంలో రైతులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. స‌ర్వేను ప్రారంభించారు.

బీడు భూముల లెక్క తేలుతోంది : ఏవో విశ్వామిత్ర‌

డిజిటల్ సర్వేతో బీడు భూముల లెక్క కూడా తేలుస్తామ‌ని మావల ఏవో విశ్వామిత్ర తెలిపారు. డిజిటల్ క్రాప్ సర్వే అనంత‌రం రైతుకు డిజిట‌ల్ నెంబ‌ర్ కేటాయిస్తామ‌న్నారు. పత్తి , వరి సోయా, కంది, జొన్న, పంటల సాగు విస్తీర్ణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేస్తామ‌ని చెప్పారు. బీడు భూముల వివరాలు, పోడు భూముల వివరాలు కూడా తెలుస్తాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అంచలంచెలుగా డిజిటల్ సర్వేను అన్ని మండలాలకు విస్తరించే అవకాశం ఉంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement