Tuesday, September 24, 2024

TG ఆ బిల్లు ఆమోదించండి స‌ర్‌ – గ‌వ‌ర్న‌ర్‌కు మంత్రి సీత‌క్క విన‌తి

మున్సిపాలిటీగా మార‌నున్న‌ ములుగు
2022 అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం
అప్ప‌టి నుంచి గ‌వ‌ర్న‌ర్ ద‌గ్గ‌రే పెండింగ్‌
బిల్లు ఆమోద‌మైతే ఈ ఏడాదే ఎన్నిక‌లు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ములుగు:
జిల్లా కేంద్ర‌మైన ములుగును పంచాయ‌తీ స్థాయి నుంచి మున్సిపాలిటీగా మార్చే బిల్లును ఆమోదించాల‌ని గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వర్మను పంచాయ‌తీ రాజ్‌, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క కోరారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి విజ్ఞ‌ప్తి చేశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ ములుగు పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ 2022లో నాటి ప్రభుత్వం అసెంబ్లీలో బిల్ పెట్టిందని, అది గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుకు ఆమోద ముద్ర వేయాలని గవర్నర్‌ను కోరినట్లు సీత‌క్క‌ చెప్పారు. కాగా, దీనికి గ‌వ‌ర్న‌ర్‌ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ములుగు జిల్లా నుంచి కొన్ని గ్రామాలను గవర్నర్ దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నారని సీత‌క్క తెలిపారు.

బిల్లు ఆమోద‌మైతే..

జిల్లా కేంద్రమైన ములుగుతోపాటు, సమీప గ్రామాలైన బండారుపల్లి, జీవంతారావుపల్లి గ్రామాలను కలుపుకొని మున్సిపాలిటీ ఏర్పాటు కానుంది. ములుగుకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని బండారుపల్లి, కొత్తగా ఏర్పడ్డ జీవంతరావుపల్లి పంచాయతీలను విలీనం చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఒక వేళ ములుగు మున్సిపాల్టీగా అవ‌త‌రిస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం 16,533 మంది జనాభా ఉంటారు. జిల్లా కేంద్ర‌మైన త‌ర్వాత ములుగు ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌నాభా కూడా పెరిగారు. బిల్లు గ‌వ‌ర్న‌ర్ ఆమోదిస్తే ఈ ఏడాది ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది.

- Advertisement -

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌తిపాద‌న‌..

జిల్లాల పున‌ర్విభ‌జ‌న త‌ర్వాత అప్ప‌టి సీఎం కేసీఆర్ ఏటూరు నాగారం ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు ములుగును మున్సిపాలిటీగా చేయాల‌ని స్థానిక నాయ‌కులు విజ్ఞ‌ప్తి చేశారు. వారి విజ్ఞ‌ప్తి మేర‌కు కేసీఆర్ ప్ర‌భుత్వం స్పందించింది. కేసీఆర్ సూచ‌న మేర‌కు అప్ప‌టి మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్ త‌దిత‌రుల చొర‌వ‌తో అధికారులు ప్ర‌తిపాద‌న‌లు చేశారు. ఈ ప్ర‌తిపాద‌న‌లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి కమిషనర్‌కు పంపించారు. 2022లో అసెంబ్లీ ఆమోదించింది. దీన్ని గ‌వ‌ర్న‌ర్ ఆమోదానికి పంపించారు. అప్ప‌టి నుంచి ఆ బిల్లు పెండింగ్‌లో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement