Monday, November 18, 2024

TG రైతుల ప‌రిహారం చెల్లింపు కేసులో కాగ‌జ్ న‌గ‌ర్ ఆర్డీవో ఆఫీసు జ‌ప్తు …

ఉమ్మడి ఆదిలాబాద్- ఆంధ్రప్రభ బ్యూరో – నిర్వాసిత రైతుల ప‌రిహారానికి సంబంధించి కేసులో ఆసిఫాబాద్ కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ ఆర్డీవో ఆఫీస్ చరాస్తులను కోర్టు ఉత్త‌ర్వుల మేర‌కు గురువారం జ‌ప్తు చేశారు. ఆర్డీవో సురేష్ కుమార్ జోక్యం చేసుకుని సినీయ‌ర్ సివిల్ జ‌డ్జితో మాట్లాడి గ‌డువు కోర‌డంతో జ‌ప్తు నిలిపి వేశారు. కాగజ్ నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పీపీ రావు ప్రాజెక్టు ముంపు కింద హత్తిని గ్రామానికి చెందిన 132 ఎకరాల భూమిని రైతులు కోల్పోవాల్సి వచ్చింది. 14 ఏళ్లు గడిచినా ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోవడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించగా మూడు నెలల్లో పరిహారం రూ .5 కోట్ల 33 లక్షల 10 వేలు బాధితులకు అందించాలని గత ఏడాది జూలై 27వ తేదీన హైకోర్టు తీర్పునిచ్చింది.

అయితే ఇంతవరకు పరిహారం రాకపోవడంతో రైతులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ అధికారుల తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్డీఓ ఆఫీసు చరాస్తులను జప్తు చేయాల‌ని ఆసిఫాబాద్‌ సీనియర్ సివిల్ జడ్జి ఈ ఏడాది జూన్ 27వ తేదీన తీర్పునిచ్చారు. దీంతో జిల్లా కోర్టు అధికారులు గురువారం కాగజ్నగర్ ఆర్డీవో ఆఫీసు ఫర్నిచర్, కుర్చీలు, టేబుళ్లు, బీరువాలు, కంప్యూటర్లు సీజ్ చేసి ట్రాక్టర్లలో ఎక్కిస్తుండగా.. వెంటనే ఆర్డీవో సురేష్ కుమార్ కోర్టు అధికారులతో మాట్లాడి రెండు నెలల గడువు కోరారు. రెండు నెలల్లో 5 కోట్ల 33 లక్షల పరిహారాన్ని బాధిత రైతులందరికీ అందిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో కోర్టు అధికారులు జప్తును నిలుపు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement