అప్పులు చెల్లించాలని రైతులకు వేధింపు
రైతు భూముల వేలానికి సర్కార్ ప్రయత్నం
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, అంకోల్ తండా ప్రజలను ఆదుకుంటానని నమ్మించి.. ఇప్పుడు రైతులను అప్పు చెల్లించాలంటూ వేధించడం, రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న నమ్మక ద్రోహానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఓ మాట, ఎన్నికలలో గెలిచాక మరో మాట.. ఇదీ సీఎం రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణి అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
రైతుల భూము వేలానికి సర్కార్ ప్రయత్నం
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం, దుర్కి, నస్రుల్లాబాద్, మిర్జాపూర్, నాచుపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతులకు అప్పులు తీర్చాలని ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఎమ్మెల్సీ కవిత ఆవేదన చెందుతున్నారు. భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
అంకోల్ తండాలో రైతులపై ఒత్తిడి
రుణాలు మాఫీ చేసి అన్నదాతకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, డబ్బులు కట్టాలంటూ అంకోల్ తండాలో రైతులపై ఒత్తిడి తీసుకురావడం, బలవంతంగా భూముల వేలానికి ప్రయత్నించడం నియంతృత్వ పాలనను తలపిస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, అంకోల్ తండా ప్రజలను ఆదుకుంటానని నమ్మించి, ఇప్పుడు రైతులను అప్పు చెల్లించాలంటూ వేధించడం , రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న నమ్మక ద్రోహానికి నిదర్శనమని అంటూ ట్వీట్ చేశారు.