42 శాతానికి రిజర్వేషన్ పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు
రిజర్వేషన్ పెంపు కోసం అవసరమైతే ఆందోళనలు చేస్తాం
కామారెడ్డి బిసి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్
బిసి సంఘాల నేతల సమావేశంలో కవిత
హైదరాబాద్: బీసీల రిజర్వేషన్ లను 42 శాతానికి పెంచిన అనంతరమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రిజర్వేషన శాతాన్ని పెంచాలని రేవంత్ సర్కార్ను కోరారు.. హైదరాబాద్‌లోని తన నివాసంలో బిసి సంఘాల నేతలలో నేడ ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీసీల జనాభా ఎంతో తెలికుండా హామీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. జనాభాలో సగానికిపైగా బీసీలు ఉన్నారని చెప్పారు. కానీ 42 శాతం అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో అంతుపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నదని చెప్పారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలు నిర్వహిస్తారా.. అనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. రిజర్వేషన్లు పెంచకపోతే ఆ ఎన్నికలు జరగనిచ్చేది లేదని స్పష్టం చేశారు. మండల కేంద్రాలు, జిల్లాల్లో నిరసన ప్రదర్శన చేస్తామన్నారు బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత, బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతే ఎన్నికలపై ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదని చెప్పారు. సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3న ఇందిరా పార్కు వద్ద భారీ సభను నిర్వహిస్తామన్నారు.