నిజామాబాద్: పసుపు బోర్డు ఏర్పాటును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. అయితే, క్వింటాలు పసుపుకు రూ. 15 వేల కనీస మద్ధతు ధర ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, పసుపు దిగుమతులపై నియంత్రణ విధించాలని సూచించారు. ఈ రెండు చేసినప్పుడే పసుపు బోర్డుకు సార్థకత ఏర్పాడుతుందని, అప్పుడే పసుపు రైతులకు సంపూర్ణ న్యాయం లభిస్తుందని స్పష్టం చేశారు.
తూతూమంత్రంగా పసుపు బోర్డును ఏర్పాటు చేయడం కాదని, అందుకు తగిన సౌకర్యాలు, పరిశోధన సమర్థ్యాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూర్చాలని సూచించారు. పసుపు బోర్డునే ఏర్పాటు చేయాలని తాము కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని గుర్తు చేశారు. తాము పసుపు బోర్డుపై డిమాండ్ చేసినప్పుడు బీజేపీ ఎంపీ అర్వింద్ రాజకీయాల్లో కూడా లేరని విమర్శించారు
పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటించిన విధానంపై అభ్యంతరాలున్నాయని, పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బీజేపీ కార్యక్రమంలా చేశారని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించలేదని, ప్రొటొకాల్ ను పాటించలేదని, ఇది ప్రభుత్వ నియమనిబంధనలను విరుద్ధమని స్పష్టం చేశారు. కేవలం బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ కూర్చొని ప్రారంభించుకున్నారని, స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు.
పసుపు బోర్డును ఏర్పాటు చేయాలంటూ 2014లో తాను ఎంపీగా ఎన్నికైన నెల రోజుల్లోనే అప్పటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశానని గుర్తు చేశారు. “పలువురు ముఖ్యమంత్రులను కలిసి పసుపు బోర్డు ఏర్పాటుకు మద్ధతుగా లేఖలు సేకరించాను. ప్రధాన మంత్రిని నరేంద్ర మోదీని రెండు సార్లు కలిసి బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాను. పార్లమెంటును అనేక సార్లు మాట్లాడడమే కాకుండా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ప్రైవేటు మెంబర్ బిల్లును కూడా ప్రవేశపెట్టాను.” అని వివరించారు.
బోర్డు ఏర్పాటు మాత్రమే కాకుండా కనీస మద్ధతు ధరను ప్రకటించాలని, దిగుమతులపై నియంత్రణ విధించాలని కూడా కేంద్రానికి అనేక సార్లు వినతులు అందించానని అన్నారు. ఇలా తాను గతంలో త్రిముఖ వ్యూహంతో అలుపెరగని పోరాటం చేశానని స్పష్టం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తడి తెస్తూనే పసుపు ఆధారిత పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడానికి కృషి చేశానని తెలిపారు.
కేవలం బోర్డు రావడం మాత్రమే సరిపోదని, మద్ధతు ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుందని చెప్పారు. ఇతర దేశాల నుంచి నాణ్యతలేని పసుపు దిగుమతి అవుతోందని, దాంతో రైతులు నష్టపోతున్నారని, కాబట్టి దిగుమతులను నియంత్రించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
2014లో 8 లక్లల క్వింటాళ్లు దిగుమతవుతే ఇప్పుడు రెట్టింపయ్యిందని చెప్పారు. ఏటేటా దిగుమతులు పెరుగుతున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
రకరకాల మాటలతో రైతులను, ప్రజలను మభ్యపెట్టిన బీజేపీ ఎంపీ అర్వింద్ పై విరుచుకుపడ్డారు. గాలి మాటలు మాట్లాడడం మానేసి పసుపుకు మద్ధతు ధర సాధించాలని ఎంపీ అర్వింద్ కు సూచించారు. స్పైసెస్ బోర్డును బెంజ్ కారులాంటిదని, పసుపు బోర్డు అంబాసిడర్ కారులాంటిదని గతంలో అర్వింద్ అన్నారని, పసుపును అవహేళన చేసిన అర్వింద్ కు ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు.
తాము కేంద్రంపై పదేపదే ఒత్తిడి చేయడం వల్లే గతంలో స్పైసెస్ బోర్డు కార్యాలయం ఏర్పాటైందని, అది కూడా ఆయన గొప్పతనమని అర్వింద్ మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. ఎవరు ఏం చేయకున్నా ప్రతి మూడో సంవత్సరం పసుపు ధర పెరుగుతుందని, కానీ అది తన ఘనత అని ఆయన చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
కాగా, స్పైసెస్ పార్కు ఏర్పాటుకు వేల్పూర్ వద్ద గతంలో కేసీఆర్ 42 ఎకరాలు కేటాయించారని, ఆ పార్కులో పసుపు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. జాక్రాన్ పల్లిలో విమానాశ్రయానికి కేసీఆర్ ప్రభుత్వం 800 ఎకరాలు సేకరించిందని, అక్కడ ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని ఎంపీ అర్వింద్ ను డిమాండ్ చేశారు.
ఈ పత్రిక సమావేశంలో మాజీ మంత్రి , ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ , జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, బాజిరెడ్డి జగన్ , నిజామాబాద్ మేయర్ నీతు కిరణ్, మాజీ చైర్మన్ అలీమ్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు