హైదరాబాద్: బతుకమ్మని అవమానించేలా మాట్లాడిన మంత్రులపై ఏం చర్యలు తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను మాయచేసిన విషయంపై తాము ప్రశ్నిస్తే పలువురు మంత్రులు ఏకంగా బతుకమ్మనే అవమానిస్తూ మాట్టాడారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత నేడు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఎందుకని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని, అయితే ఇందిరాగాంధీ, సోనియా, రాహుల్ కూడా బతుకమ్మ ఎందుకు ఆడారని నిలదీశారు. బీఆర్‌ఎస్ హయాంలో బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించామని చెప్పారు. జీవో కూడా విడుదల చేశామని గుర్తుచేశారు.
తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఉద్యమంలో స్ఫూర్తి నింపిన రూపాన్ని విగ్రహంగా మలుచుకున్నామని చెప్పారు. తెలంగాణ తల్లిపై రేవంత్ రెడ్డి సర్కార్ గెజిట్ ఇవ్వడం దారణమన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా భరతమాత విగ్రహంపై గెజిట్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి విగ్రహాలు పెట్టుకున్నామని అన్నారు. జీవో ఇస్తేనే వారి విగ్రహాలు పెడతామా అని ప్రశ్నించారు. ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి జీవో ఇచ్చారన్నారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రయోజనాలే ముఖ్యమని, ప్రజలు కాదన్నారు. ఆ పార్టీది తెలంగాణ వాదం కాదని, కాంగ్రెస్ వాదమని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లకు ఓట్లు ఉన్నప్పుడే తెలంగాణ ప్రజలు గుర్తుకు వస్తారని ధ్వజమెత్తారు.ఎన్ని కేసులు పెట్టినా ఊరూరా తెలంగాణ తల్లిని నిలుపుకుంటామన్నారు. కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.