Thursday, November 21, 2024

TG – సింగ‌రేణికి భారీ న‌ష్టం ! వ‌ర్షాల ప్ర‌భావంతో త‌గ్గిన ఉత్ప‌త్తి

మ‌ణుగూరులో 48 శాతం
భూపాల‌ప‌ల్లిలో 30 శాతం మాత్ర‌మే

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, మ‌ణుగూరు, భూపాల‌ప‌ల్లి : ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల ప్ర‌భావం సింగ‌రేణిపై ప‌డింది. మ‌ణుగూరులో ఉన్న నాలుగు గ‌నుల్లో, అలాగే భూపాల‌ప‌ల్లి జిల్లాలో ఉన్న రెండు గ‌నుల్లో ఉత్ప‌త్తి బాగా త‌గ్గిపోయింది. గ‌నుల్లోకి నీరు ప్ర‌వేశించిన‌ప్పుడు ఒక రెండు మూడు గంట‌లు బొగ్గు త‌వ్వ‌కాలు నిలిపి వేస్తారు. నీరు త‌గ్గిన త‌ర్వాత బొగ్గు త‌వ్వ‌కాలు ప్రారంభిస్తారు. దీంతో బొగ్గు ఉత్ప‌త్తి ర‌వాణా త‌గ్గిపోతుంది. మ‌ణుగూరు ప్రాంత గ‌నుల్లో ఈ నెల ఒక‌టో తేదీ నుంచి 9వ తేదీ వ‌ర‌కు 2,45,420 మెట్రిక్ ట‌న్నులు కాగా, 1,18,590 మెట్రిక్ ట‌న్నులు ఉత్ప‌త్తి అయింది. అంటే 48 శాతం ఉత్ప‌త్తి జ‌రిగిన‌ట్లు అధికారులు వెల్ల‌డించిన లెక్క‌లు చెబుతున్నాయి. భూపాల‌ప‌ల్లి జిల్లాలో వారం రోజుల‌పాటు 31,200 మెట్రిక్ టన్నులు కాగా 9,400 మెట్రిక్ టన్నులు సాధించిన్నట్లు తెలిపారు. అంటే 30 శాతం ఉత్ప‌త్తి అయింది.

మ‌ణుగూరులో
మ‌ణుగూరు ప్రాంతంలో ఈ నెల ఒక‌టో తేదీ నుంచి9వ తేదీ వ‌ర‌కు నాలుగు గ‌నుల నుంచి 2,45,420 మెట్రిక్ ట‌న్నుల బొగ్గు ఉత్ప‌త్తి చేయాల్సి ఉంది. అయితే ఈ వారంలో అత్య‌ధిక వ‌ర్షం ప‌డింది. మ‌ణుగూరు ప్రాంతంలో 231 మిమీ వ‌ర్ష‌పాతం న‌మోదైంది. దీంతో ఉత్ప‌త్తికి ఆటంకం క‌లిగింది. ఈ వారంలో 1,18,590 మెట్రిక్ ట‌న్నుల బొగ్గు ఉత్ప‌త్తి అయింది.

- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో
గత రెండు రోజులుగా కురిసిన వ‌ర్షాల ప్ర‌భావం సింగ‌రేణి బొగ్గు గ‌నుల‌పై ప‌డింది. జిల్లాలో కురుస్తున్న వర్షాలతో భూపాలపల్లి సింగరేణి ఏరియా పరిధిలోని ఓపెన్ కాస్ట్ 2, 3 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గినట్లు సింగ‌రేణి అధికారులు తెలిపారు. వారం రోజుల ఉత్పత్తి, రవాణా వివరాలు వెల్లడించారు. వ‌ర్షాల‌కు సోమ‌వారంతోపాటు రోజులు బొగ్గు త‌వ్వ‌కాలు నిలిచిపోయాయి. ఓసీ -2 లక్ష్యం 31,200 మెట్రిక్ టన్నులు కాగా 9,400 మెట్రిక్ టన్నులు సాధించిన్నట్లు, ఓసీ -3 లక్ష్యం 36,000 మెట్రిక్ టన్నులు కాగా 7,000 మెట్రిక్ ట‌న్నులు ఉత్పత్తి సాధించిన్నట్లు తెలిపారు. అదే విధంగా ఈ వారం 86,088 మెట్రిక్ ట‌న్నులు రవాణా లక్ష్యం కాగా 33,209 మెట్రిక్ ట‌న్నులు రవాణా జరిగినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement