మాటలే తప్ప చేతలు లేని వ్యక్తి రేవంత్
ఇప్పటికే 49 మంది విద్యార్ధులు మరణించారు
అయినా సిఎం స్పందన కరవు
ఇప్పటికైనా కళ్లు తెరవండి..
విద్యార్దులకు మంచి ఆహారం పెట్టండి
రేవంత్ కు హరీశ్ రావు హితవు
హైదరాబాద్ – మాటలే తప్ప చేతలు లేని ముఖ్యమంత్రి నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కావాలి..? ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి..? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బిఆర్ఎస్ నేత,మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో అనారోగ్యం పాలై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని లీలావతిని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలసి నేడు హరీశ్ రావు పరామర్శించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ, గురుకులల్లో ఫుడ్ పాయిజన్ అభం శుభం తెలియని విద్యార్థులకు శాపం అవుతున్నదని అన్నారు.. కలుషిత ఆహారం విద్యార్దుల ప్రాణాలను బలిగొంటుందని , రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని సార్లు చెప్పినా అర్థం కావడం లేదన్నారు. విద్యా మంత్రి, ఎస్సీ, ఎస్టీ మంత్రి కూడా రేవంత్ రెడ్డి అయినప్పటికీ ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖల నిర్వహణలో వైఫల్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నదన్నారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయని మండిపడ్డారు.
గురుకులాలను పరిశీలించుకు వెళుతున్న ప్రతి పక్ష నాయకులను అడ్డుకుంటారని అన్నారు హరీశ్ రావు. మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి , సత్యవతి లను కూడా ఈ ప్రభుత్వం అరెస్టు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడం పై ఉన్న ధ్యాస, కనీసం జిల్లాలో ఉన్న పిల్లల భవిష్యత్తు పై లేదా? అంటూ నిలదీశారు.
నిన్న నల్గొండ – కేతేపల్లి మండలం గురుకులంలో ఐదో తరగతి చదువుతున్న నీలం సాయి గణేష్ పాము కాటుకు గురై ఆసుపత్రి పాలయ్యాడని వెల్లడించారు. ఫుడ్ పాయిజన్ కేసులు, కుక్క కాట్లు, పాము కాట్లు, ఎలుక కాట్లు, కరెంటు షాకులు నిత్య కృత్యం అవుతున్న ప్రభుత్వం ముద్దు నిద్ర వేడడం లేదని మండిపడ్డారు. ఇప్పటి వరకు 49 మంది విద్యార్థులు చనిపోతే ఉలుకు లేదు పలుకు లేదన్నారు.
ఏడాదిలో ఏ ఘనకార్యాలు చేశారని ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.. సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారని దుయ్యబట్టారు..తాము గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వార్డెన్లు, ప్రిన్సిపల్స్ మీద చర్యలు తీస్కొని చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు.
మధ్యాహ్న భోజనానికి నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతున్నరని, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడం లేదని హరీశ్ రావు వేలెత్తిచూపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే గురుకులాల మొక్కుబడి సందర్శన కాకుండా పట్టెడు పనికొచ్చే బువ్వ పెట్టి పొట్టలు నింపండి అని కోరారు.
ప్రచారం కోసం కాదు పిల్లల భవిషత్తు కోసం ఆలోచించండి అని హరీశ్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు… చలికాలం పిల్లలు వణుకుతున్నారని, వేడి నీళ్ళు కూడా లేవన్నారు… , ఆ సమస్యలు పరిష్కరించాలని కోరారు.. హాస్టళ్లలో పని చేసే సిబ్బంది జీతాలు ఇవ్వడం లేదని, . గ్రీన్ ఛానెల్ ఉంటే ఆరు నెలలుగా హాస్టళ్లకు ఎందుకు డబ్బులు ఇవ్వటం లేదు అని హరీశ్‌రావు నిలదీశారు.