హైదరాబాద్ – రేవంత్‌రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని స్పష్టం చేశారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని.. రేవంత్ సీఎం అయ్యేవాడు కాదన్నారు. కేసీఆర్‌కు, రేవంత్‌కు నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. సీనియర్లు తన కుర్చీని గుంజుకోకుండా రేవంత్ చేసుకోవాలని.. తన కుర్చీని ఎప్పుడు గుంజుకుపోతారోనన్న భయంలో రేవంత్ ఉన్నాడన్నారు.
తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐదేళ్ల తర్వాత వచ్చేది బీఆర్‌ఎస్ మాత్రమేనని.. సీఎం అయ్యేది కేసీఆర్ అని స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్ మూడుసార్లు ఓడిందని.. మరి కాంగ్రెస్ ఖతం అయిపోయిందా? అంటూ ప్రశ్నించారు. 31 సాకులు చూపుతూ రుణమాఫీ చేయకుండా రేవంత్ రైతులను మోసం చేశారని విమర్శించారు.
ఆరు మంత్రి పదవులు నింపేందుకే రేవంత్‌కు హైకమాండ్ అనుమతి ఇవ్వట్లేదని.. విద్య, మైనారిటీ, పోలీసుశాఖలకు మంత్రులు, డిప్యూటీ స్పీకర్, చీఫ్‌విప్ లేరన్నారు. కేసీఆర్ పవర్‌ఫుల్ ఫైటర్, లీడర్ అని చెప్పారు. రేవంత్‌రెడ్డి చిల్లరమాటలు ఆపితే మించిదని సూచించారు.
ఓ మంత్రి గవర్నర్‌ని కలిశారని.. ఇంకో మంత్రి కాబోయే సీఎంనని సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారన్నారు. సీఎం చిట్‌చాట్‌లో మాట్లాడి కుర్చీకి ఉన్న గౌరవం తగ్గించారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి అబద్దాలు చూసి గోబెల్స్ కూడా సిగ్గుపడుతారన్నారు. రేవంత్ మాట్లాడితే ఎక్కడ ఆ దుర్భాష విని పిల్లలు చెడిపోతారోనని ఇండ్లల్లో తల్లిద్రండులు టీవీలను బంద్ చేస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు మూడువైపులా సముద్రం ఉందంటారని.. అలా అయితే గోవా వెళ్లడం ఎందుకని జోకులు వేస్తున్నారన్నారు. రాజీవ్ కంప్యూటర్ కనిపెట్టాడని అంటాడని.. దిల్‌సుఖ్‌నగర్‌లో విమానాలు అమ్ముతారని.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండీ ఇలా మాట్లాడుతూ పోతే.. గ్రూప్-1 పరీక్ష రాసేవాళ్లు ఏమైపోవాలి? అన్నారు.
మల్లన్నసాగర్ బాధితులకు ఒక్క ఇల్లూ కట్టలేదని తప్పుగా మాట్లాడారని.. మల్లన్నసాగర్‌కు 50వేల ఎకరాలు కాదు.. 17వేల ఎకరాలేనన్నారు. 14వేల ఎకరాలు ప్రభుత్వ పట్టా అసైన్డ్ భూమి.. 3వేల ఎకరాలు ఫారెస్ట్ భూమి అని చెప్పారు. ఏడు గ్రామాలు ముంపునకు గురైతే 14 గ్రామాలు అయ్యాయని తెలిపారు. సీఎం ఇలా మాట్లాడుతూపోతే ఇక ఆయన మాటలను ఎవరూ నమ్మరన్నారు. తాను కొడంగల్‌లో ఒడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. సన్యాసం తీసుకోకుండా ఎంపీకి ఎందుకు పోటీశారని నిలదీశారు.
రేవంత్ తప్పుడు విధానాలతో రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పారు హరీశ్ రావు. ఇతర రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ పెరిగిపోతున్నా.. తెలంగాణలో మాత్రం ఎందుకు తగ్గుతోందని నిలదీశారు. హైడ్రా ఎఫెక్ట్‌తో రియల్ ఎస్టేట్ రంగం ఢమాల్ ఢమాల్ అయ్యిందన్నారు. రేవంత్ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే తప్పుడు కేసులు పెట్టున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులతో తనను.. కేటీఆర్‌ను ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. తమపైనే కాకుండా ప్రశ్నించే గొంతులపైనా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందన్నారు. పాదయాత్రకు తాను సిద్ధమని.. మూసీ దగ్గరి నుంచే బయలుదేరుతామని సీఎంకు సవాల్ విసిరారు. రేపా? ఎల్లుండా చెప్పాలని.. కేటీఆర్, తాను ఇద్దరం వస్తామన్నారు.