Sunday, November 17, 2024

TG – హైడ్రా పేరుతో హైద‌రాబాద్‌లో విధ్వంసం – హరీశ్ రావు

నిరుపేద‌ల ఇళ్లు కూలిస్తే సహించ‌బోమ‌న్న ఎమ్మెల్యే హ‌రీష్
తొర్రూర్‌లో రైతుల ధ‌ర్నాకు సంఘీభావం
రైతు డిక్ల‌రేష‌న్ పేరుతో రేవంత్ మోసం
ఉపాధి హామీ నిధులు సైతం ప‌క్క‌దారి
రాష్ట్రంలో రౌడీ రాజ్యం న‌డుస్తుంద‌న్న హ‌రీష్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, మ‌హ‌బూబాబాద్ : హైదరాబాద్ మహా నగరంలో చెరువుల సంరక్షణ పేరుతో ‘హైడ్రా’ విధ్వంసం సృష్టిస్తోందని ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కక్షపూరితంగా ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారని మండిపడ్డారు. పేదల ఇళ్లు కూల్చితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రైతులు నేడు చేపట్టిన ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

- Advertisement -

రాష్ట్రంలో రౌడీ రాజ్యం
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీని భేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ లో ఏ ఒక్క హామీ అమలు కాలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం అమలవుతోందని ఆయన ఫైర్ అయ్యారు.

ఉపాధి హామీ నిధులు ఎక్క‌డ …
ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి రూ.12 వేల హామీ ఏమైందో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలన్నారు. మూతపడిన చెక్కర కర్మాగారాలను తెరిపిస్తామని, పసుపు బోర్డును తీసుకొస్తామంటూ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇక భూమి లేని నిరుపేద రైతులకు రూ.5 లక్షల రైతు భీమా పత్తా లేకుండా పోయిందని ఆరోపించారు. దసరాలోపు ప్రభుత్వం రైతుబంధు నిధులు విడుదల చేయాలని.. ఎకరానికి రైతల ఖాతాల్లో రూ.7,500 జమ చేయాలన్నారు.

మ‌హిళ‌ల‌కు క‌రువైన భ‌ద్ర‌త‌

రాష్ట్రంలో బాలికలు, మహిళలకు భద్రత కరువైందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శించారు. భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంద‌ని చెప్పారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ వేదిక‌గా ఆయ‌న పోస్టు చేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని హెచ్చరించినా నిర్లక్ష్యం వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎక్క‌డో ఒక చోట లైంగిక దాడి ఘ‌ట‌న‌లు
ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట లైంగిక దాడి ఘటనలు చోటుచేసుకుంటున్నాయ‌ని హ‌రీశ్‌రావు అన్నారు . ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన లైంగిక దాడి ఘటన వార్త త‌న‌ను తీవ్రంగా కలచివేసిందన్నారు. హోం మంత్రిత్వ శాఖను కూడా తానే నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఇందిరమ్మ రాజ్యం అని ఊదరగొట్టడమే కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రాధాన్యతలో మహిళలకు భద్రత లేదని తేటతెల్లమయిందంటూ విమర్శించారు.

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు ప్రాధాన్య‌త
గత ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింద‌ని హ‌రీశ్ పేర్కొన్నారు. షీ టీమ్స్, సఖి భరోసా కేంద్రాలు ఏర్పాటుచేసి భద్రత కల్పించింద‌ని, కానీ ఇందిరమ్మ రాజ్యం అని ఊదరగొట్టడమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యతలో మహిళా భద్రత లేదని తేటతెల్లమైంద‌ని విమ‌ర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి శాంతి భద్రతల పర్యవేక్షణకు చర్యలు చేపట్టాల‌ని సూచించారు. మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement