Friday, November 22, 2024

TG – హరీశ్‌రావు హౌజ్‌ అరెస్ట్.. మ‌ళ్లీ టెన్ష‌న్ టెన్ష‌న్

హైద‌రాబాద్ – శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడిగాంధీ ఇంట్లో మేడ్చల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ నేతల భేటీ పిలుపు ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు అరికెపూడి గాంధీ నివాసంలో శేరిలింగంపల్లి నియోజవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి భేటీ నిర్వహించేందుకు మేడ్చల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ నేతలు సిద్ధమయ్యారు.

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కూడా భేటీకి వస్తానని ప్రకటించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, గాంధీకి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో కౌశిక్‌రెడ్డి ఇంటి మీద గాంధీ అనుచరులు గురువారం దాడి చేసిన విషయం తెలిసిందే.

మాజీ మంత్రి హరీశ్‌రావు హౌజ్‌ అరెస్ట్..
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంట్లో భేటీ అవుతామని మేడ్చల్‌ జిల్లా నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు ఇంటి వద్ద భారీగా మోహరించారు. కోకాపేటలోని ఇంట్లోనే హరీశ్‌రావును హౌస్‌ అరెస్ట్‌ చేశారు. హరీశ్‌రావు ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు హరీశ్‌రావు బయటికి వెళ్లకుండా అటు ఇంట్లోకి ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు సునీతా లక్ష్మారెడ్డి, మాలోత్‌ కవితను హరీశ్‌రావు నివాసంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.

- Advertisement -

బీఆర్‌ఎస్‌తో యుద్ధం కాదు.. కౌశిక్‌రెడ్డితోనే యుద్ధం: ఎమ్మెల్యే గాంధీ

ఇది బీఆర్‌ఎస్‌,గాంధీకి యుద్ధం కాదని, కౌశిక్‌రెడ్డికి తనకు మధ్య యుద్ధమని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విషయమై శుక్రవారం ఉదయం మీడియాతో ఆయన మాట్లాడారు.
ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తించాలన్నారు.. పార్టీలో ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తున్నారని ఆయ‌న మండి ప‌డ్డారు..
ఆర్‌ఎస్‌, కేసీఆర్‌ అంటే నాకు గౌరవం. వ్యక్తిగతంగా మాత్రమే కౌశిక్‌రెడ్డితోనే నాకు యుద్ధం. సమఉజ్జీ కూడా కాని కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లినందుకు బాధపడుతున్నా అని అన్నారు.

గాంధీ ఇంటి వద్ద భారీ బందోబస్తు..

గాంధీ ఇంట్లో భేటీకి బీఆర్‌ఎస్‌ పిలుపు నేపథ్యంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి గాంధీ నివాసానికి ఎవరు వచ్చినా అడ్డుకుంటున్నారు. శుక్రవారం ఉదయం గాంధీ ఇంటికి వచ్చిన పలువురు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను అరెస్టు చేసి ఇప్పటికే అక్కడినుంచి తరలించారు.

మేడ్చల్‌ బీఆర్‌ఎస్‌ నేతల ముందస్తు అరెస్టులు..

మరోవైపు గాంధీ ఇంట్లో భేటీకి సిద్ధమవుతున్న పలువురు మేడ్చల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలను పోలీసులు ఉదయం నుంచే అరెస్టు చేస్తున్నారు. పలువురిని హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు. భేటీ కోసం బీఆర్‌ఎస్‌ నేతలు ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వెళితే ఉద్రిక్తతలకు దారి తీస్తుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మా ఎమ్మెల్యే ఇంటికి మేం వెళితే తప్పేంటి: శంభీపూర్‌ రాజు

ఎమ్మెల్యే గాంధీ ఇంట్లో మేడ్చల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ నేతల భేటీకి పిలుపునిచ్చిన జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత శంభీపూర్‌రాజు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీనిపై రాజు స్పందించారు. తమ పార్టీ ఎమ్మెల్యే ఇంటికి తాము వెళితే తప్పేంటి అని రాజు ప్రశ్నించారు. ఎమ్మెల్యే గాంధీ బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా అని చెప్పిన మాటలను ఈ సందర్భంగా రాజు గుర్తు చేశారు.
ఎమ్మెల్యే గాంధీ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇంటికి రావాలని రాజు ఆహ్వానించారు. మరోపక్క గాంధీ ఇంటికి బయలుదేరిన మేడ్చల్‌ బీఆర్‌ఎస్‌ నేతలను, రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన గులాబీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై అడిషనల్‌ ఎస్పీ ఫిర్యాదు.. కేసు నమోదు

పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై అడిషనల్‌ ఎస్పీ రవిచందన్‌ ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఫిర్యాదుతో కౌశిక్‌రెడ్డిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడి పట్ల చర్యలు తీసుకోవాలని సైబరాబాద్‌ కమిషనరేట్‌ ముందు ఆందోళనకు దిగిన హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, వద్దిరాజు రవిచంద్ర తదితర బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులను పోలీసులు అక్కడినుంచి తరలించి కేశంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేయాల్సివచ్చింది. అనంతరం రాత్రి 11 గంటలకు హరీశ్‌రావు సహా ఇతర బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలను పోలీసులు కేశంపేట పోలీస్‌స్టేషన్‌ నుంచి విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement