పూటకు మూడు మాటలు చెప్పడంలో ఎక్ప్ ఫర్ట్
అబద్దాలు చెప్పడంలో ఆయనకే పిహెచ్డీ
రేవంత్ డబుల్ స్టాండర్డ్‌కు సోనియా గాంధీ కూడా బలి
మీరు ప్రారంభించే కోకాకోలాకు నీళ్లు అదిస్తున్నది కాళేశ్వరమే
రేవంత్ ఏడాది పాలనలో అన్ని వైపల్యాలే అంటూ హరీశ్ రావు ఫైర్
హైదరాబాద్ – మాటలు మార్చటంలో రేవంత్ రెడ్డి పీహెచ్‌డీ చేశారని.. రెండు కాదు.. మూడో మాట కూడా మార్చగల నేర్పరి అని మండి పడ్డారు బిఆర్ఎస్ సీనియర్ నేత , ఎమ్మెల్యే హరీశ్ రావు. పూటకో పార్టీ మార్చటం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని, రాక్షసులు అన్న నోటితోనే.. దేవత అని పొగడగల సామర్థ్యం ఆయన సొంతమని విమర్శించారు. ఏడాది పాలనలో కూల్చివేతలు తప్ప.. రేవంత్ నిర్మించినవి లేవని, తనది కూడా పోలీస్ కుటంబం అన్న సీఎం పోలీస్ కుటుంబాలను రాచిరంపాన పెడుతున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆయన నేడు ‘నాడు నేడు’ పేరుతో ఎన్నికల ప్రచారంలో సీఎం ఇచ్చిన హామీలను స్క్రీన్‌లో ప్రదర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రికి సిగ్గు ఎగ్గు లేదంటూ ఫైర్ అయ్యారు.
ఏడాది పాలనలో రైతుబంధు,బతుకమ్మ చీరలు, ఎల్ఆర్ఎస్, కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా.. ప్రతి అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారని ఎత్తి చూపారు. ఆడపిల్లను మోసం చేయటమంటే పాపం చేసినట్లు తెలంగాణ సమాజం భావిస్తుందని హరీష్ రావు అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట ప్రకారం ఎల్ఆర్ఎస్ కట్టొద్దని ప్రజలను కోరుతున్నామని అన్నారు. పోటీ పరీక్షల విషయంలో ముఖ్యమంత్రిది.. డబుల్ కాదు.. ట్రిపుల్ స్టాండర్డ్ అని ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో సైతం రేవంత్ రెడ్డి మాట మార్చారని విమర్శించారు. సీఎం ప్రారంభించబోయే కోకాకోలా కంపెనీకి సరఫరా అయ్యే నీళ్ళు కూడా కాళేశ్వరం నీళ్ళేనని అన్నారు. పోటీ పరీక్షల వాయిదా విషయంలో ఎవరు తలకమాసినోడో రేవంత్ రెడ్డికు తెలుసునని అన్నారు.
సోనియా గాంధీ కూడా బలయ్యారు..
సీఎం రేవంత్ రెడ్డి డబుల్ స్టాండర్డ్‌కు సోనియా గాంధీ కూడా బలయ్యారని వాపోయారు హరీశ్ రావు. పచ్చ పార్టీలో ఉన్నప్పడు సోనియా బలిదేవత అని మూడు రంగుల జెండా పట్టగానే దేవత అయ్యారని గుర్తు చేశారు అవసరమైతే కాళ్ళు పట్టుకోవటం.. తర్వాత కాళ్ళు గుంజటం ముఖ్యమంత్రి నైజమని విమర్శించారు. రాళ్ళు వేయటం పువ్వులు వేయటంలో కూడా సిఎం దిట్టని ఒంటికాలిపై లేచారు హరీశ్ రావు
సమగ్ర సర్వేపై అప్పట్లో విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అడ్డమైన ప్రశ్నలు వేయటం లేదా అని ప్రశ్నించారు. కూల్చివేతల విషయంలో ఆనాడు ఏం మాట్లాడారని, . ఇప్పుడు ఏం చేస్తున్నారని నిలదీశారు. నాడు మద్యం వద్దని మాట్లాడారని ఇప్పుడు మద్యమే ప్రభుత్వానికి మాద్యమైందన్నారు. ఎవరు తాగుబోతుల తెలంగాణ చేస్తున్నారో సీఎం రేవంత్ రెడ్ది చెప్పాలని హరీష్ రావు అన్నారు.
రేవంత్ రెడ్డిలో అపరిచితుడు
రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. మోసం దగా.. వంచనకు నిలువెత్తు నిదర్శనమని అన్నారు హరీశ్ రావు. . సీఎం భాషతో పిల్లలు చెడిపోతారని తల్లిదండ్రులు భావిస్తున్నారని అన్నారు. నక్సలైట్లు ఉండాలని గతంలో చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు వద్దు అంటున్నారని అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో మూడో ఫేక్ ఎన్‌కౌంటర్ జరిగిందని ఆరోపించారు. ఫార్మాసిటీ కాదని లెఫ్ట్ పార్టీల నేతలకు చెప్పి ఇప్పుడు మాట మార్చారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నోటికి మెక్కాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపరిచితుడని అన్నారు. రైతు బరోసా ఒక పంటకు కాదని రెండు పంటలకు ఇవ్వాలని అన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో ప్రజాస్వామ్య హననం జరుగుతోందని దుయ్యబట్టారు.